టీడీపీ ఎమ్మెల్సీ  బీటెక్ రవి చెన్నైలో అరెస్ట్

టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ఆయనను చెన్నై విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ‘చలో పులివెందుల’ కార్యక్రమం నేపథ్యంలో బీటెక్ రవి, మరి కొందరిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం పెద్దకుడాలలో దళిత మహిళ హత్యపై సరైన న్యాయం జరగలేదంటూ టీడీపీ ‘చలో పులివెందుల’ కార్యక్రమాన్ని చేపట్టింది. 

అసలైన నిందితులను వదిలేశారని ప్రచారం జరగడంతో నాగమ్మ కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిసెంబరు 19న టీడీపీ ర్యాలీ నిర్వహించి, డీఎస్పీకి వినతిపత్రం ఇచ్చారు. 

ఈ నేపథ్యంలో తమను అవమానించారంటూ మృతురాలి బంధువులు అదే నెల 21న ఫిర్యాదు చేశారు. దీంతో టీడీపీ నేతలపై పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అయితే పులివెందుల పోలీసు స్టేషన్‌లో 21 మంది టీడీపీ నేతలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కాగా,  2018లో పులివెందుల పూల అంగళ్ల వద్ద అల్లర్లు, ఘర్షణ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బీటెక్‌ రవిపై వారెంట్‌ పెండింగ్‌లో ఉందని పోలీసులు పేర్కొంటున్నారు. రాళ్ల దాడి, హత్యాయత్నం కేసులో ఇన్నాళ్లూ అరెస్ట్‌ కాకుండా, బెయిల్‌ తీసుకోకుండా బీటెక్ రవి తప్పించుకు తిరుగుతున్నారని ఆరోపిస్తున్నారు.  గతంలో జరిగిన రాళ్ల దాడిలో ఎస్‌ఐ చిరంజీవికి గాయాలయ్యాయి. హత్యాయత్నం కింద బీటెక్ రవితో పాటు మరో 63 మందిపై కేసులు నమోదయ్యాయని ఎస్పీ అన్బురాజన్‌ మీడియాకు తెలిపారు.

తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత, కడప పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు కర్నాటి శ్వేత శ్రీరెడ్డి, కడప పార్లమెంటు అధ్యక్షుడు ఎం.లింగారెడ్డి, ఎమ్మెల్సీ బీటెక్‌ రవి, ఎస్సీ ఎస్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్‌ రాజు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, హరిప్రసాద్‌, గోవర్ధన్‌రెడ్డి  తదితరులపై కేసు నమోదైంది.