కాగితాలను వినియోగించకుండా పార్లమెంటు, శాసన సభల్లో కార్యకలాపాలను నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రాజెక్టును సిద్ధం చేస్తోంది. హిమాచల్ ప్రదేశ్ శాసన సభ మాదిరిగానే మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని చట్ట సభలను కాగిత రహితంగా మార్చేందుకు నేషనల్ ఈ-విధాన్ అప్లికేషన్ (నెవా)ను రూపొందిస్తోంది.
చట్ట సభల సభ్యులకు సభల్లో జరిగే కార్యకలాపాలు, ప్రశ్నలు, ఇతర పత్రాలను ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తోంది. ఈ ప్రాజెక్టును అమలు చేసేందుకు నోడల్ మంత్రిత్వ శాఖగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వ్యవహరిస్తోంది.
డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్‌లోని 44 ప్రాజెక్టుల్లో ఇదొకటి. హిమాచల్ ప్రదేశ్ విధాన సభ ఉపయోగిస్తున్న ఈ-విధాన్ సాఫ్ట్‌వేర్‌ను దేశంలోని ఇతర చట్ట సభలకు కూడా ఉపయోగపడేవిధంగా అప్‌గ్రేడ్ చేశారు.
లోక్‌సభ, రాజ్యసభ, 31 శాసన సభలు, 6 శాసన మండళ్లు ఈ యాప్‌ను ఉపయోగించుకుంటాయి. ఈ విధానంతో దేశంలోని చట్ట సభల సభ్యులంతా ఒకే వేదికపైకి వస్తారని ఇటీవలే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
More Stories
గణేశ్ మండపంపై రాళ్లు.. సూరత్లో ఉద్రిక్తత
దేశంలో మంకీపాక్స్ తొలి కేసు?.. భయం వద్దన్న కేంద్రం
ఉగ్రవాదులను తరిమికొట్టేందుకు గ్రామస్థులకే శిక్షణ