సౌరవ్ గంగూలీకి  గుండెపోటు

 బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ ఆటగాడు సౌరవ్ గంగూలీ గుండెపోటు కారణంగా ఆసుపత్రిలో చేరారు. వైద్యులు హార్ట్ ఎటాక్‌గా నిర్ధారించి ఆపరేషన్ చేయాలని సూచించారు.

 కొన్ని రిపోర్టుల ప్రకారం.. ఉదయం జిమ్‌లో ఉండగా ఉన్నట్లుండి కళ్లు చీకట్లు కమ్మడం, తీవ్రమైన ఛాతీ నొప్పితో గంగూలీ బాధపడ్డారు. దీంతో అక్కడి సిబ్బంది ఆయనను హుటాహుటిన దగ్గరలోని ఉడ్‌ల్యాండ్స్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. 

ఆయనను పరీక్షించిన వైద్యులు.. హృదయపు నాళాల్లో అడ్డంకులు ఏర్పడడమే ఛాతీ నొప్పికి కారణంగా గుర్తించారు. సాయంత్రంలోపు ఆంజియోప్లాస్టీ(గుండె నాళాల్లో అడ్డంకులు తొలగింపు) చికిత్స చేయడం జరుగుతుందని చెప్పారు. 

దీనికోసం ఆసుపత్రి యాజమాన్యం ముగ్గురు స్పెషలిస్ట్ వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేసింది. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. చికిత్స పూర్తయిన తరువాత త్వరగా కోలుకుంటారని వైద్యులు చెబుతున్నారు.