దేశ వ్యాప్తంగా రేపటి నుండి వ్యాక్సిన్ డ్రై రన్ 

అసోం, ఆంధ్రప్రదేశ్‌, పంజాబ్‌, గుజరాత్‌ల్లో డిసెంబర్‌ 28, 29 తేదీలలో వ్యాక్సిన్‌ డ్రైరన్‌ (వ్యాక్సిన్‌ మాక్‌ డ్రిల్‌) చేపట్టిన అనంతరం..దేశంలోని మిగిలిన ప్రాంతాలకు ఈ ప్రక్రియను విస్తరించాలని కేంద్రం యోచిస్తోంది. 

తొలి మాక్‌డ్రిల్‌ విజయవంతం కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. జనవరి 2 నుండి మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ డ్రై రన్‌ నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ అంశంపై కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి…అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల కార్యదర్శులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించినట్లు సమాచారం. 
 
ప్రతి రాష్ట్రంలోని ఎంపిక చేసిన ప్రదేశాల్లో ఈ డ్రైన్‌ జరుగుతుందని తెలుస్తుంది. ఈ వ్యాక్సిన్‌ డ్రై రన్‌లో టీకాలను నిల్వ కేంద్రాలకు తరలించడం, అభ్యర్థులకు అందించడం వంటి చర్యలు ఉంటాయి. గుజరాత్‌లో ఇటీవల నిర్వహించిన వ్యాక్సిన్‌ మాక్‌ డ్రిల్‌లో 475 మంది లబ్ధిదారులు పాల్గన్నారు. 
 
ప్రణాళికబద్ధమైన ప్రక్రియలో లోపాలను గుర్తించి..సరి చేసుకోవడమే ఈ డ్రైన్‌ ప్రధాన ఉద్దేశం. కాగా, నూతన ఏడాదిలో స్వదేశీ వ్యాక్సిన్‌కు అత్యవసర వినియోగానికి అనుమతినిచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. వచ్చే ఏడాది స్వదేశీ టీకాను అందుబాటులోకి తెస్తామని, నూతన సంవత్సరంలో వ్యాక్సినేషన్‌ ప్రారంభిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ  సైతం తెలిపారు. దీనిని పునురుద్ఘాటిస్తూ డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా విజి సోమనీ సూచనప్రాయంగా వెల్లడించారు. 
 
మ‌రో వైపు వ్యాక్సినేష‌న్ కోసం కేంద్ర ప్ర‌భుత్వం సుమారు 83 కోట్ల సిరంజీల‌కు ఆర్డ‌ర్ చేసింది. వీటితో పాటు అద‌నంగా మ‌రో 35 కోట్ల సిరంజీల కోసం బిడ్స్ దాఖ‌లు చేసింది. ఈ సిరంజీల‌ను కోవిడ్ వ్యాక్సినేష‌న్‌కు వాడ‌నున్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం చెప్పింది.