తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపిక కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రాజేస్తున్నది. ఒక వంక గతంలో తెలుగు దేశంలో క్రియాశీలకంగా ఉన్న ఎంపీ ఎ రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు పార్టీ అధిష్ఠానం సంకేతం ఇవ్వడంతో ఆపార్టీలో చాలామంది సీనియర్ నేతలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.
రేవంత్ రెడ్డిని నియమిస్తే పార్టీలో కొనసాగే ప్రసక్తి లేదని అంటి వి హనుమంతరావు వంటి పలువురు నేతలు బహిరంగంగానే హెచ్చరిస్తూ ఉండగా, మరో అనేకమంది సీనియర్ నేతలు తెలంగాణలో ప్రత్యామ్న్యాయ రాజకీయ శక్తిగా ఎదుగుతున్న బిజెపి వైపు చూస్తున్నారు. గత ఎన్నికల ముందే బీజేపీలో చేరిన మాజీ మంత్రి డీకే అరుణను పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా చేయడంతో పాటు మాజీ మంది పి సుధాకరరెడ్డి, మాజీ ఎంపీ జి వివేక్ వెంకటస్వామి వంటి వారికి పార్టీలో కీలక స్థానాలు లభిస్తూ ఉండడంతో ఇప్పుడు చాలామంది కాంగ్రెస్ నేతలు బిజెపి వైపు చూస్తున్నారు.
ఇప్పటికే ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ గా ఉన్న సినీ నటి విజయశాంతి బీజేపీలో చేరడమే కాకుండా పార్టీలో ఆమెకు ముఖ్యమైన బాధ్యతలు అప్పచెప్పుతున్నట్లు కధనాలు వెలువడుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంకన్న సాక్షిగా రాబోయే రోజుల్లో బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించడం కాంగ్రెస్ లో ప్రకంపనాలు రేపుతున్నది.
నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్న ఆయన. తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనేని చెప్పిన మొదటి వ్యక్తిని తానేనని గుర్తు చేశారు. వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికల ముందే బిజెపిలోకి చేరడానికి సిద్దమైన ఆయనను పార్టీ నాయకత్వం సర్దిచెప్పి ఆపింది.
రాబోయే రోజుల్లో బీజేపీ బలపడుతుందని, కేసీఆర్ ఒంటెద్దు పోకడలు మానాలని హితవు పలికారు. ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రతిపక్షాలను కలుపుకోవాలని సూచించారు. ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని, ప్రజారంజక నిర్ణయాలు తీసుకోవాలని పేర్కొన్నారు. అయితే తన సోదరుడు, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్‌లోనే కొనసాగుతారని తెలిపారు.
పీసీసీ పదవి కోసం కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి మధ్య పోటీ నడుస్తున్నది. పీసీసీ చీఫ్‌ను కాలమే నిర్ణయిస్తోందని పేర్కొంటూ పార్టీలు వేరైనా అన్నదమ్ములంగా తామిద్దరం కలిసి ఉంటామని స్పష్టం చేశారు.
More Stories
ఫిరాయింపులపై నాలుగు వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి
కోల్‌కతా వైద్యురాలి ఫొటోలు సోషల్ మీడియా నుండి తొలగించండి!
రైలు బోల్తా కొట్టేందుకు గ్యాస్ సిలిండర్‌తో ప్లాన్… ఐఎస్ కుట్ర!