పోలవరం జాతీయ ప్రాజెక్టుకు 2017–18 ధరల ప్రకారం రూ.47,725.74 కోట్ల అంచనా వ్యయానికి కేంద్ర జల్ శక్తి శాఖ ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్ (పెట్టుబడి అనుమతి) ఇచ్చేందుకు మార్గం సుగమమైంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో చేపట్టిన 15 జాతీయ ప్రాజెక్టులకు ఇచ్చిన తరహాలోనే పోలవరం ప్రాజెక్టుకూ నీటిపారుదల విభాగం పనులకు నిధులు మంజూరు చేయాలని జల్ శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌కు.. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సభ్యులు ఎస్కే హల్దార్ నివేదిక ఇచ్చారు.
యూపీ సింగ్ అధ్యక్షతన పనిచేసే సీడబ్ల్యూసీ టీఏసీ (సాంకేతిక సలహా మండలి) 2017–18 ధరల ప్రకారం పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయానికి ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఇక ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్ కమిటీకి కూడా యూపీ సింగ్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.
పోలవరం ప్రాజెక్టుకు 2017–18 ధరల ప్రకారం నిధులు ఇచ్చేందుకు అంగీకరిస్తూ ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్ ఇవ్వడం ఇక లాంఛనమే కాగలదు. ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్ ఇస్తూ కేంద్ర జల్ శక్తి శాఖ పంపిన ఫైలును కేంద్ర ఆర్థిక శాఖ యథాత«థంగా ఆమోదించి కేంద్ర కేబినెట్‌కు పంపుతుంది. విభజన చట్టం ప్రకారం ఆ ఫైలును కేంద్ర కేబినెట్ ఆమోదిస్తుంది. దాంతో.. 2017–18 ధరల ప్రకారం పోలవరం ప్రాజెక్టు పనులకు కేంద్రం నిధులు విడుదల చేస్తుంది.
పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని 2017–18 ధరల ప్రకారం రూ.55,548.87 కోట్లుగా సీడబ్ల్యూసీ టీఏసీ 2019 ఫిబ్రవరి 11న ఆమోదించింది. జాతీయ ప్రాజెక్టుల అంచనా వ్యయం 25 శాతం కంటే పెరిగితే.. వాటిని రివైజ్డ్ కాస్ట్ కమిటీ (ఆర్‌సీసీ)కి పంపి మదింపు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ 2016లో మార్గదర్శకాలు జారీ చేసింది.
వాటి ప్రకారం పోలవరం అంచనా వ్యయాన్ని ఆర్‌సీసీకి ప్రతిపాదించారు. కేంద్ర జల్ శక్తి శాఖ ఆర్థిక సలహాదారు జగ్‌మోహన్ గుప్తా నేతృత్వంలోని ఆర్‌సీసీ పోలవరం అంచనా వ్యయాన్ని రూ.47,725.74 కోట్లుగా తేల్చి కేంద్ర జల్ శక్తి, ఆర్థిక శాఖలకు నివేదిక ఇచ్చింది.
More Stories
తెలంగాణకు రూ.1.32 లక్షల కోట్ల పెట్టుబడులు
ట్రంప్ `పౌరసత్వం’ నిర్ణయంపై అమెరికాలోని 22 రాష్ర్టాల దావా
తిరుమలలో శారదాపీఠం అక్రమ నిర్మాణంపై హైకోర్టు ఆగ్రహం