నడ్డాపై దాడి సమయంలో ఉన్న ఐపీఎస్ కు మమతా ప్రమోషన్ 

బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డపై డిసెంబర్ 10న పశ్చిమ బెంగాల్ లో జరిగిన దాడి వెనుక నేరుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం ఉన్నట్లు భావించవలసి వస్తున్నది. దాడి సమయంలో విధులలో ఉన్న ముగ్గురు ఐపీఎస్ అధికారులను డెప్యూటేషన్ పై వెనుకకు రప్పించాలని కేంద్ర హోమ్ శాఖ జారీ చేసిన ఉత్తరువులను బేతఖరు చేసిన మమతా బనెర్జీ ప్రభుత్వం ఇప్పుడు వారిలో ఒకరికి ప్రమోషన్ కూడా ఇచ్చింది. 
ఆ సమయంలో భద్రతకు బాధ్యత వహించిన ముగ్గురు ఐపీఎస్ అధికారులను కేంద్ర ప్రభుత్వం డిప్యుటేషన్‌పై రావాలని ఆదేశించింది. అయితే, మమతా బెనర్జీ ఈ ఉత్తర్వును ఏమాత్రం ఖాతరు చేయడం లేనట్లుగా కనిపిస్తున్నది. కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసి డిప్యుటేషన్‌పై ఐటీబీపీకి పంపగా  మమతా దీదీ మాత్రం ఆయనను వెంటేసుకు వస్తున్నది.
కేంద్రం ఆదేశాలతో డిప్యుటేషన్‌కు పంపించకపోవడమే కాకుండా ఆయనకు పదోన్నతి కల్పించి మరోసారి కేంద్రంతో అమితుమికి సిద్ధమైంది. రాజీవ్‌ మిశ్రా దక్షిణ బెంగాల్ పోలీస్ జోన్లో ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజీ) గా ఉన్నారు. అతడికి మమత బెనర్జీ ప్రభుత్వం అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీ) గా పదోన్నతి కల్పించింది.
 డైమండ్ హార్బర్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ భోలనాథ్ పాండేను ఎస్పీ హోంగార్డ్ పదవికి బదిలీ చేశారు. అదే సమయంలో, మరో ఐపీఎస్ అధికారి డీఐజీ ప్రవీణ్ కుమార్ త్రిపాఠికి ఇప్పటివరకు ఉన్న స్థానంలోనే ఉంచారు. జేపీ నడ్డా పర్యటన సమయంలో రాజీవ్ మిశ్రాతో పాటు, పాండే, త్రిపాఠి ఇద్దరు కూడా భద్రతా ఏర్పాట్లలో మోహరించారు.
జేపీ నడ్డా కాన్వాయ్‌పై రాళ్ళు రువ్విన ఘటన అనంతరం ఈ ముగ్గురు అధికారులను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ డిసెంబర్ 16 న డిప్యుటేషన్‌పై పిలిచింది. వీరిలో రాజీవ్‌ మిశ్రాను ఐటీబీపీకి, భోలనాథ్‌ పాండేను బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (బీపీఆర్ అండ్‌ డీ), ప్రవీణ్‌ కుమార్‌ త్రిపాఠిని ఎస్‌ఎస్‌బీకి కేటాయిస్తూ కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
అయితే, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వీటిని పట్టించుకున్న దాఖలా లేదు. ఇది ముమ్మాటికి “రెచ్చగొట్టే దశ” గా బీజేపీ నాయకుడు షహనావాజ్ హుస్సేన్ అభివర్ణించారు. నడ్డా కాన్వాయ్‌పై దాడికి పాల్పడిన సమయంలో భద్రతా చర్యలను చూసిన అధికారికి పదోన్నతి కల్పించడాన్ని  దాడి చేసిన వారికి ప్రతిఫలం లభిస్తుందనడానికి ఇది సంకేతమని విమర్శించారు.
మరోవంక, గ‌వ‌ర్న‌ర్ జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్‌ను వెంట‌నే ఆ ప‌ద‌వి నుంచి త‌ప్పించాలంటూ తృణ‌మూల్ ఎంపీలు రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌కు వినతిపత్రం  స‌మ‌ర్పించారు. రాష్ట్రంలో రాజ్యాంగ విలువ‌ల‌ను కాపాడటంలో గ‌వ‌ర్న‌ర్ ధ‌న్‌క‌ర్ పూర్తిగా విఫ‌ల‌మ‌య్యార‌ని, ఆయ‌న‌ ప‌దేప‌దే చ‌ట్టాల‌ను ఉల్లంఘించార‌ని ఎంపీలు ఆరోపించారు.