రెండు అంశాలపై ప్రభుత్వం –  రైతులు అవగాహన  

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న రైతు సంఘాలతో కేంద్రం బుధవారం జరిపిన ఆరోవిడత చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ప్రధానంగా నాలుగు అంశాలపై చర్చలు జరుగగా, రెండింటిపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. అయితే రెండు విషయాలపై వారి మధ్య అవగాహన ఏర్పడింది.

విద్యుత్‌ చార్జీల పెంపు, పంటవ్యర్థాల కాల్చివేతపై జరిమానా విషయంలో రైతుల అభ్యంతరాల పరిష్కారానికి కేంద్రం అంగీకారం తెలిపింది. అయితే రెండు ప్రధాన వివాదాస్పద అంశాలైన ‘నూతన వ్యవసాయ చట్టాల రద్దు’, ‘మద్దతు ధరలకు (ఎంఎస్పీ) చట్టబద్ధత’పై మాత్రం ప్రతిష్టంభన వీడలేదు. అపరిష్కృత అంశాలపై జనవరి 4న మళ్లీ సమావేశం కావాలని నిర్ణయించారు.   ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో సుమారు ఐదు గంటల పాటు ఈ చర్చలు సాగాయి.

సమావేశం అనంతరం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ మీడియాతో మాట్లాడుతూ సుహృద్భావ వాతావరణంలో చర్చలు సాగాయని చెప్పారు. సమస్యకు దాదాపు 50 శాతం పరిష్కారం లభించిందని చెప్పారు. మిగిలిన అంశాలపై జనవరి 4న మళ్లీ చర్చలు జరుగుతాయని పేర్కొన్నారు. శాంతియుతంగా, క్రమశిక్షణతో నిరసనలు కొనసాగిస్తున్న రైతులను ఆయన అభినందించారు.

కొత్త చట్టాలను రద్దు చేయాలని రైతులు పట్టుబడుతున్నారని, అయితే వాటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రభుత్వం వారికి వివరించే ప్రయత్నం చేస్తున్నదని పేర్కొన్నారు. మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలన్న రైతుల డిమాండ్‌పై ప్రశ్నించగా.. దీనిపై రాతపూర్వక హామీ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ఇప్పటికే తెలియజేశామని  గుర్తు చేశారు. సమావేశంలో తోమర్‌తోపాటు కేంద్రమంత్రులు పీయూష్‌ గోయల్‌, సోమ్‌ ప్రకాశ్‌ పాల్గొన్నారు.

సమావేశం అనంతరం రైతు నాయకుడు కల్వంత్‌ సింగ్‌ సంధూ మాట్లాడుతూ  విద్యుత్‌ చట్టం, పంట వ్యర్థాల కాల్చివేతపైనే బుధవారం ప్రధానంగా చర్చించినట్టు చెప్పారు. జనవరి 4న జరిగే సమావేశంలో మద్దతు ధరలు, చట్టాల రద్దు అంశాలపై చర్చిస్తామని తెలిపారు. మరో రైతు నాయకుడు హన్నన్‌ మొల్లా మాట్లాడుతూ  మద్దతు ధర విధానం సక్రమంగా అమలయ్యేందుకు మార్గాల అన్వేషణ, కొత్త వ్యవసాయ చట్టాల్లో సవరణలకు కమిటీ వేస్తామని కేంద్రం ప్రతిపాదించిందని, దాన్ని తాము తిరస్కరించినట్టు చెప్పారు.

గురువారం నిర్వహించాల్సిన ట్రాక్టర్‌ ర్యాలీని జనవరి 4 వరకు వాయిదా వేశామని, ఒకవేళ చర్చలు విఫలమైతే తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తామని పేర్కొన్నారు. మరో రైతు నేత అభిమన్యు కొహర్‌ మాట్లాడుతూ  ప్రత్యామ్నాయ ఆప్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం కోరిందని, అయితే చట్టాలను రద్దు చేయాలనే తాము డిమాండ్‌ చేశామని  చెప్పారు.

మద్దతు ధరకు చట్టబద్ధత సాధ్యం కాదని కేంద్ర మంత్రి చెప్పారని, అయితే మొదటి వేలం ధర ఎంఎస్పీ కంటే ఎక్కువగా ఉండాలని 2018లో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం వర్సెస్‌ అన్నదాత సమితి కేసులో హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశామని తెలిపారు.