కార్లలో ఇక ఎయిర్ బ్యాగులు తప్పనిసరి

కార్లు తదితర ప్యాసింజర్ వాహనాల ముందు సీట్లో కూడా ఎయిర్ బ్యాగుల ఏర్పాటు తప్పనిసరి చేయాలనే నిబంధన త్వరలోనే భారత్‌లో అమలులోకి రానుంది. ఇప్పటివరకు డ్రైవర్ సీటు వద్ద మాత్రమే ఎయిర్ బ్యాగ్ తప్పనిసరి. ఇకపై ముందువరసలో డ్రైవర్ పక్కన ఉండే సీటు వద్ద కూడా ఈ ఏర్పాటు తప్పనిసరి కానుంది. 

ఈ మేరకు కేంద్ర రవాణా శాఖ మంగళవారం ఓ ముసాయిదా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం కారు ముందువైపు ఉండే ప్యాసింజర్ సీటులో కూడా ఎయిర్ బ్యాగ్ ఉండాలనే నిబంధనకు అనుగుణంగా వాహనదారులు మార్పులు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు కొత్త మోడల్ కార్లకు 2021 ఏప్రిల్ 31 వరకు.. ఇప్పటికే వాడుతున్న కార్లకు జూన్ 1 గడువు తేదీగా నిర్ణయించారు. ఎయిర్ బ్యాగ్‌ల ప్రమాణాల గురించి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్(బిఐఎస్) ఆదేశాలు వెలువడేంతవరకు అవి ఎఐఎస్ 145 నిబంధనలకు అనుగుణంగా ఉండాలని ఈ నోటిఫికేషన్‌లోసూచించారు.

అంతేకాకుండా భవిష్యత్తులో తయారు చేసే వాహనాల్లో ప్రయాణికుల సీట్లలో కూడా ఎయిర్ బ్యాగ్‌లను అమర్చే విధంగా ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్ ్డ(ఎఐఎస్) నియమావళిలో మార్పులు చేయనున్నారు. వేగాన్ని సూచించే స్పీడ్ అలెర్ట్, రివర్స్ పార్కింగ్ సెన్సర్లు, సీటు బెల్ట్ రిమైండర్లు వంటివి ఇప్పటికే దాదాపు అన్ని కార్లలో ఏర్పాటు చేస్తున్నారు.

అయితే, ప్రాణాలను కాపాడే ఎయిర్‌ బ్యాగులను మాత్రం ఇప్పటికీ తప్పనిసరి చేయకపోవడం గమనార్హం. ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులను రక్షించే పూర్తి ఏర్పాట్లు ఉండాలని, ఖరీదుతో సంబంధం లేకుండా అన్ని కార్లలో సంబంధిత ఏర్పాట్లు ఉండి తీరాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు కేంద్ర రవాణా శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. 

అయితే, తాజా నిర్ణయం అమలులోకి వస్తే సాధారణ కార్ల ధరలు ఐదునుంచి రూ 8,000 వరకు పెరిగే అవకాశం ఉంది. 2019 జూలై 1నుంచి అన్ని కార్లలో డ్రైవర్ సీట్లో ఎయిర్ బ్యాగ్‌ను తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. అయితే డ్రైవర్ సీటు పక్కన కూర్చునే ప్రయాణికుడికి కూడా అంతే ప్రమాదం పొంచి ఉంటుందనేది కాదనలేని నిజం.

ఈ నేపథ్యంలోనే కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది.ఈ ముసాయిదా నోటిఫికేషన్ అవధి నెలరోజుల్లో పూర్తవుతుందని, ఈలోగా ఈ విషయమై ఎవరికైనా ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఆవిషయాన్ని దాన్ని రవాణా శాఖ జాయింట్ కార్యదర్శి దృష్టికి తీసుకురావాల్సి ఉంటుందరి రవాణా శాఖ అధికారులు వెల్లడించారు.