జర్నలిస్ట్ లకు అనూహ్య సవాళ్లు ఎదురైన 2020

Coronavirus (File Photo: IANS)

కరోనా మహమ్మారితో మానవ జీవనమే తీవ్రమైన ఆటుపోట్లకు గురయిన 2020లో  మానవ కార్యకలాపాలనే స్తంభించి పోవడమే కాకుండా, అగ్రరాజ్యాలు సహితం నివ్వెర పోయాయి.  కోట్లాది మంది ప్రజలు తమ జీవనోపాధులను కోల్పోయారు.

ఇదే సమయంలో జర్నలిస్ట్ లు సహితం గతంలో ఎన్నడూ యెరుగనంతటి సవాళ్ళను వృత్తిపరంగా ఎదుర్కొన్నారు. ఒక వంక కరోనా మహమ్మారితో ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కోవడమే కాకుండా, మొత్తం మీడియా రంగం గతంలో ఎన్నడూ ఎరుగని ఆటుపోట్లకు గురయింది. ఉద్యోగ భద్రత ప్రమాదంలో పడింది. అదే సమయంలో పలు అణచివేత విధానాలకు గురయ్యారు.

కరోనా మహమ్మారిని ఆసరాగా తీసుకొని పలు ప్రజాస్వామ్య ప్రభుత్వాలే గతంలో ఎరుగనిరీతిలో తీవ్రమైన అణచివేత విధానాలకు పాల్పడ్డాయి. ఒక వంక అసలు కరోనా విషయంలో ఏమి జరుగుతుందో తెలియకుండా ప్రభుత్వాలు దారుణమైన గోప్యతలను పాటిస్తూ ఉండగా,  మరోవంక తెలిసిన వార్తలు ప్రచురించినా  దారుణమైన ఆంక్షలకు జర్నలిస్ట్ లు గురి కావలసి వచ్చింది.

ఇక ఇదే అదనుగా క్రిమినల్ గ్యాంగ్ లు, తీవ్రవాద సంస్థలు సహితం జర్నలిస్ట్ లను లక్ష్యంగా చేసుకొని దాడులు జరిపాయి. ఈ సంవత్సరం కరోనా మహమ్మారి సందర్భంగా చెలరేగిన హింసలో సుమారు 600 మంది జర్నలిస్ట్ లు చనిపోయారని ఒక అంచనా తెలుపుతున్నది. రెండో  ప్రపంచ యుద్ధం సమయంలో సహితం ఇంత  భారీ సంఖ్యలో జర్నలిస్ట్ లు మృతి చెందలేదు.

భారత దేశంలో కరోనా కారణంగా 53 మంది జర్నలిస్ట్ లు చనిపోయారని జెనీవా కేంద్రంగా పనిచేస్తున్న మీడియా నిఘా సంస్థ ప్రెస్ ఎంబ్లెమ్ కాంపెయిన్ తెలిపింది. ఈ సంస్థ ప్రకారం మొత్తం ప్రపంచంలో 531 మంది కరోనాతో మృతి చెందారు. మరి అనేకమంది మృతుల వివరాలు తెలియవలసి ఉంది.  పెరు లో అత్యధికంగా 93 మంది జర్నలిస్ట్ లు మృతి  చెందగా, బ్రెజిల్ లో 48 మంది, ఈక్వడార్ లో 41 మంది, బాంగ్లాదేశ్ లో 40 మంది, మెక్సికో లో 38 మంది, అమెరికాలో 27 మంది, టర్కీ లో 16 మంది, ఇంగ్లాండ్, పాకిస్థాన్ లలో 12 మంది చొప్పున మృతి చెందారు.

వాస్తవానికి చాలామంది మరణానికి  కారణాలను నిర్దిష్టంగా గుర్తించడం  కష్టమే. వృత్తి సంబంధంగా   మరణాలకు   గురయ్యారా లేదా అన్నది చెప్పడం కొంచెం కష్టమే. ఒక విధంగా ఈ మహమ్మారి మీడియా ప్రధాన స్రవంతిలో తీవ్రమైన అశాంతికి గురిచేసింది. చాలామంది జర్నలిస్ట్ లు సగం జీతాలే లేదా అంత కన్నా తక్కువకే పనిచేయవలసి వచ్చింది. పలువురు ఉద్యోగాలు కోల్పోయారు. పెద్ద పెద్ద మీడియా సంస్థలే తమ ప్రచురణ సంస్థలను పాక్షికంగా మూసివేశాయి. లేదా పేజీలను తగ్గించాయి. ప్రకటనల  ఆదాయం భారీగా పడిపోవడంతో మీడియా మనుగడ ప్రశ్నార్ధకరంగా మారింది.

వివిధ వర్గాల ప్రజలను కరోనా మహమ్మారి సమయంలో ఆదుకోవడానికి ఉద్దీపన పధకాలను భారీగా ప్రకటించిన ప్రభుత్వాలు మీడియా సంస్థలను మాత్రం పట్టించుకోవడం లేదు. దానితో చాలా మీడియా సంస్థలు కొద్దిమంది ఉద్యోగులతో డిజిటల్ మీడియా వైపు చూస్తున్నాయి.

అందుకనే మీడియా పరిస్థితులను లోతుగా అధ్యయనం చేసి, ఆదుకోవడం కోసం ఒక స్వతంత్ర దర్యాప్తు యంత్రాంగంను ఐక్యరాజ్యసమితి పరిధిలో ఏర్పాటు చేయాలనే డిమాండ్లు చెలరేగుతున్నాయి. భారత ప్రభుత్వం కరోనా మహమ్మారి సమయంలో అప్రమత్తంగా వ్యవహరింపలేని కోరుతూ ఏప్రిల్ 21న మీడియా కు మార్గదర్శక సూత్రాలను విడుదల చేసింది.

మరోవంక, 2020లో క్రిమినల్ గ్యాంగ్స్,   తీవ్రవాద సంస్థల దాడులలో ప్రపంచ వ్యాప్తంగా 30 మంది జర్నలిస్ట్ లు మృతి చెందిన్నట్లు అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న  మీడియా వాచ్ గ్రూవ్ప్ కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్ (సిపిజే) తెలిపింది. వృత్తిపరమైన  వివాదాల కారణంగా మృతి చెందిన జర్నలిస్ట్ ల సంఖ్య గత ఏడాదికన్న రెట్టింపుకన్నా ఎక్కువగా ఉన్నట్లు సిపిజే ఆందోళన వ్యక్తం చేసింది.

గత ఏడాది 10 మంది మాత్రం ఆ విధంగా మూర్తి చెందారు. వీరిలో కనీసం 21 మంది ప్రత్యక్షంగా తమ వృత్తి కారణంగా  హత్యలకు గురయ్యారు. ఆందోళనకరమైన అంశం ఏమిటంటే ప్రతి 10 హత్యలలో 8 హత్యల విషయంలో హంతకులపై ఎటువంటి చర్య తీసుకోవడం లేదు. ప్రజాస్వామ్య దేశాల్లోనే ఈ విధంగా జరగడం గమనార్హం. జర్నలిస్ట్ లపై హత్యలకు పాల్పడిన వారిపట్ల అంతర్జాతీయ సమాజం క్షమా ధోరణిలో వ్యవహరిస్తున్నదని సిపిజే కార్యంరివాహక డైరెక్టర్ జోయెల్ సైమన్ విచారం వ్యక్తం చేశారు.

పైగా, తీవ్రవాద సంస్థలు జర్నలిస్ట్ లపై నిఘా ఉంచుతున్నాయి. ముఖ్యంగా మధ్య ఆసియా దేశాలలో అటువంటి సాక్ష్యాధారాలు ఎన్నో లభిస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఈ సంవత్సరం గతంలో ఎన్నడూ లేనంత విధంగా తమ వృత్తిపర కార్యకలాపాల కారణంగా అనేకమంది జర్నలిస్ట్ లు జైలుకు వెళ్ళవలసి వచ్చింది.  డిసెంబర్ 1 నాటికి ప్రపంచ వ్యాప్తగా 274 మంది జర్నలిస్ట్ లు జైళ్లలో ఉన్నట్లు సిపిజే తెలిపింది. ఎక్కువమంది జర్నలిస్ట్ లను జైలుకు పంపిన రికార్డు  చైనాదే.

అందుకనే జర్నలిస్ట్ ల వృత్తి ప్రమాదభరితంగా మారుతున్నది సిపిజే అడ్వొకేసీ డైరెక్టర్  కోర్టునే రాడ్స్చ్  తెలిపారు. అత్యధికంగా మెక్సికో,   ఆఫ్గనిస్తాన్ లలో క్రిమినల్ గ్యాంగ్ ల చేతులలో జర్నలిస్ట్ లు హత్యలకు గురవుతున్నారు.  తాజాగా, డిసెంబర్ 12న 2017లో జరిగిన ఒక ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనకు సంబంధించిన కధనాన్ని రిపోర్ట్ చేసినందుకు ఇరాన్ ప్రభుత్వం జర్నైస్ట్ రూహల్లాహ్ జాం ను ఉరితీసింది.

అయితే కరోనా కారణంగా ప్రజల కదలికలు తక్కువగా  ఉంటూ ఉండడంతో సాయుధ బృందాల కాల్పులలో ఈ సంవత్సరం చాలా తక్కువగా ముగ్గురు జర్నలిస్ట్ లు మాత్రమే మృతి చెందారు. గత  పదేళ్లలో ఘర్షణలతో మృతి  చెందిన జర్నలిస్ట్ ల సంఖ్య ఈ ఏడాది చాలా తక్కువగా ఉంది.   సిరియాపై రష్యా వైమానిక దాడులలో ఆ ముగ్గురు కూడా మృతి చెందారు. ఏది ఏమైనా  కరోనా   మహమ్మారి పత్రికా స్వాతంత్య్రంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నది.