తెలంగాణలో ప్రవేశించిన కొత్త వైరస్ 

తెలంగాణలోకి కొత్త కరోనా ప్రవేశించింది. వరంగల్‌కు చెందిన ఓ వ్యక్తికి బ్రిటన్​ స్ట్రెయిన్​ వైరస్​ సోకినట్టు హైదరాబాద్‌ సీసీఎంబీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇదే విషయాన్ని రాష్ట్ర, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖలకు నివేదించారు.  ఆరోగ్య శాఖలోని  కీలక అధికారులు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. 

అయితే కొత్త స్ట్రెయిన్​ గురించి కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా వెల్లడిస్తుందని, అప్పటివరకు అధికారికంగా  వెల్లడించలేమని చెబుతున్నారు. కొత్త స్ట్రెయిన్​ సోకిన ఈ వ్యక్తి ఈ నెల రెండో వారంలో బ్రిటన్​ నుంచి వరంగల్‌‌‌‌ కు వచ్చారు. బ్రిటన్​ రిటర్నీస్‌‌‌‌  అందరికీ టెస్టులు చేయించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశం మేరకు రాష్ట్ర ఆరోగ్య అధికారులు  ఈ నెల 24న ఆయనకు టెస్టులు చేయించారు. కరోనా పాజిటివ్‌‌‌‌గా రావడంతో శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం సీసీఎంబీకి పంపారు.

ఆ వ్యక్తికి సోకినది బ్రిటన్​లో వేగంగా వ్యాపిస్తున్న స్ట్రెయిన్​ అని సీసీఎంబీ శాస్త్రవేత్తలు తేల్చారు. అయితే మరోసారి జీనోమ్‌‌‌‌ సీక్వెన్సింగ్  టెస్టు కోసం ఆ వ్యక్తి శాంపిళ్లను, మరికొందరు బ్రిటన్​ రిటర్నీస్‌‌‌‌  శాంపిళ్లను పుణెలోని వైరాలజీ ల్యాబుకు పంపినట్టు తెలిసింది. బ్రిటన్  స్ట్రెయిన్​ సోకిన వ్యక్తి వయసు 49 ఏండ్లు అని, ఆయన నుంచి తల్లికి  వైరస్ వ్యాపించిందని అధికారులు తెలిపారు. శనివారం చేసిన టెస్టులో ఆమెకు పాజిటివ్ వచ్చిందని, ఆ శాంపిల్స్​ను కూడా జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం సీసీఎంబీకి పంపామని పేర్కొన్నారు.

కొత్త కరోనా వచ్చిన వ్యక్తితో ముగ్గురు మాత్రమే కాంటాక్ట్​ అయ్యారని అధికారులు గుర్తించారు. అందులో ఆయన తల్లికి పాజిటివ్​గా తేలింది. అయితే ఆమె ఎవరెవరిని కలిశారన్న దానిపై ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరూ వరంగల్‌‌‌‌లోని ఓ ప్రైవేట్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌లో చికిత్స ​ పొందుతున్నారు. ఇతర రోగులతో కలవకుండా వేరే  వార్డులో ఉంచారు.

ఇలా ఉండగా, బ్రిటన్​ నుంచి ఎందరు వచ్చారు, అందులో ఎందరిని ట్రేస్ చేశారనే విషయంలో ఆరోగ్య శాఖ  రోజుకో లెక్క చెప్తోంది. డిసెంబర్‌‌‌‌  9 తర్వాత 1,200 మంది మాత్రమే వచ్చారని శుక్రవారం వరకు ప్రకటించింది. తర్వాతి రోజు 1,216 మంది వచ్చినట్టు పేర్కొంది. ఈ 1,216 మందిలో అడ్రస్‌‌లు సరిగా లేనందున 154 మందిని గుర్తించలేకపోయామని ఆదివారం ప్రకటించింది.

సోమవారం నాటి ప్రకటనలో గుర్తించలేకపోయినవారి సంఖ్య 156గా తెలిపింది. ఇక ఇతర రాష్ట్రాల వాళ్లు 92 మంది ఉన్నారని ఆదివారం చెప్పగా.. సోమవారం ప్రకటనలో వారి సంఖ్య 58 మంది మాత్రమేనని పేర్కొంది. ఇలా రోజుకో మాట చెప్తుండటంతో.. హెల్త్ డిపార్ట్‌‌మెంట్  లెక్కలపై అనుమానాలు వ్యక్తమవుతున్నయి.