నిరంతర స్ఫూర్తి కేంద్రంగా వివేకానంద స్మారక శిల

కన్యాకుమారి వద్ద సముద్రంలోని శిలపై నిర్మించిన స్వామి వివేకానంద స్మారక కేంద్రం  నిరంతర స్ఫూర్తి కేంద్రంగా నిలుస్తుందని వివేకానంద కేంద్ర తెలుగు ప్రాంత సంఘఠక్ సుజాత నాయక్ తెలిపారు. ఇక్కడనే స్వామిజి మూడు రోజులపాటు ధ్యానం అనంతరం తన జీవన కార్యాన్ని గుర్తించారని ఆమె గుర్తు చేశారు. 

హైదరాబాద్ కు చెందిన ఆలోచనాపరుల వేదిక `సోషల్ కాజ్’ ఆధ్వర్యంలో “కన్యాకుమారి వద్ద వివేకానంద రాక్ మెమోరియల్ 50 సంవత్సరాలు” అంశంపై జరిగిన వెబినార్ లో ఆమె  ప్రసంగిస్తూ ఇక్కడ స్మారక కేంద్ర నిర్మించాలని చాలామంది ప్రయత్నించినా చివరకు స్వామిజి శతజయంతి సంవత్సరంలో ఆర్ ఎస్ ఎస్ తీసుకున్న నిర్ణయంతో కార్యరూపం దాల్చినట్లు చెప్పారు. 

దేశంలో ప్రతి ఇంటికి సనాతన ధర్మం గురించి తెలియచెప్పడమే తన జీవన కార్యమని స్వామిజి ఇక్కడే గుర్తించారని ఆమె పేర్కొన్నారు. నాటి ఆర్ ఎస్ ఎస్ అధినేత గురూజీ ఆదేశంపై సీనియర్ ఆర్ ఎస్ ఎస్ ప్రచారక్, మాజీ సర్ కార్యవాహ ఎకనాథ్ రెనడే బాధ్యత వహించి ఈ స్మారక కేంద్రం నిర్మించారని ఆమె వివరించారు. 

ఇక్కడ స్మారక కేంద్రం ఏర్పాటుకు తొలుత అనేక ప్రతిఘటనలు ఎదురయ్యాయని ఆమె పేర్కొన్నారు. స్థానిక క్రైస్తవులు తీవ్ర వ్యతిరేకత తెలిపారని, తాను జీవించి ఉన్నంతకాలం అనుమతిమబోనని ముఖ్యమంత్రి భక్తవత్సలం స్పష్టం చేశారని, ఆ విధంగా నిర్మిస్తే ఆ ప్రాంతపు అందానికి ముప్పు ఏర్పడుతుందని నాటి కేంద్ర శాస్త్రీయ, సాంస్కృతిక మంత్రి హ్యూమయం కబీర్ అభ్యంతరం తెలిపారని వివరించారు. 

అయితే ఎంతో సహనంతో, అందరిని ఒప్పించి, మెప్పించి ఎకనాథ్ అనుమతి సాధించారని ఆమె చెప్పారు. లాల్ బహదూర్ శాస్త్రి ద్వారా ప్రధాని జవహర్ లాల్ నెహ్రు ను కలవడం కోసం పార్లమెంట్ హౌస్ వద్ద మూడు రోజులపాటు వేచి ఉన్న సమయంలో అన్ని పార్టీలకు చెందిన 323 మంది ఎంపీల సంతకాలు సేకరించడంతో నెహ్రుకు అనుమతి ఇవ్వక తప్పులేదని అన్నారు. 

నెహ్రు ఒప్పుకోవడంతో ముఖ్యమంత్రి భక్తవత్సలంకు కూడా మరో మార్గం లేకపోయినదని, అయితే చిన్న సైజు స్మారక కేంద్రంకు మాత్రమే అనుమతి ఇచ్చారని సుజాత చెప్పారు. చివరకు కంచి పరమాచార్య ఆమోదించిన డిజైన్ ప్రకారం భారీ స్మారకంకు అనుమతించారని తెలిపారు.

అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, దేశంలోని అన్ని రాజకీయ పార్టీల నేతలు, ప్రముఖ వ్యక్తుల అందరి నుండి విరాళాలు సేకరించిన ఎకనాథ్ సాధారణ ప్రజలు సహితం ఈ నిర్మాణంలో పాల్గొనేటట్లు చేయడం కోసం ఒక రూపాయి కూపన్లు ముద్రించి దేశంలో కోట్లాది మంది నుండి కూడా నిధి సేకరించారని సుజాత వివరించారు. 

ఏ రోజు చూసినా 650 మంది శిల్పులు అక్కడ పనిచేసేవారిని, రికార్డు సమయంలో ఆరేళ్ళ కాలంలో పూర్తి ప్రపంచంలోనే అంతకు ముందెక్కడ లేని విధంగా ఒక స్మారకాన్ని సముద్రంలో నిర్మించారని ఆమె చెప్పారు.

ఒకానొక్క సమయంలో దేశంలో దుర్భిక్షం, యుద్ధం కారణంగా నిధుల సేకరణ అసాధ్యమై నిర్మాణం ఆపివేయాలి అనుకొంటున్నప్పుడు తమకు రెండు పూటలా భోజనం పెడితే చాలని నిర్మాణ పనులు కొనసాగిస్తామని శిల్పులు ముందుకు వచ్చారని ఆమె పేర్కొన్నారు.   ఈ స్మారక కేంద్రం ప్రారంభ కార్యక్రమం కూడా ఒకొక్క రోజు ఒకొక్క రాష్ట్రానికి చెందిన వారు పాల్గొనే విధంగా రెండు నెలలపాటు సాగినదని తెలిపారు. 

ఆ తర్వాత స్వామి వివేకానంద జీవన లక్ష్యమైన జాతీయ పుననిర్మాణం కార్యరూపం దాల్చేటట్లు చేయడం కోసం వివేకానంద కేంద్రను ఎకనాథ్ ఏర్పాటు చేసి, దేశ వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపట్టడం ప్రారంభించారని సుజాత చెప్పారు. స్వామిజి చెప్పిన ‘మానవ సేవ, మాధవ సేవ’ ఆదర్శాన్ని ఆచరణలో పెట్టడం కోసం ఈ కేంద్రం ఇప్పుడు పనిచేస్తున్నది. 

దేశం వ్యాప్తంగా 25 రాస్త్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాలలో 1005 వివేకానంద కేంద్ర కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఈ కేంద్రం సేవలకు గుర్తింపుగా గత ఏడాది ఫిబ్రవరిలో భారత ప్రభుత్వం  ప్రతిష్టాకరమైన గాంధీ శాంతి బహుమతిని ప్రధానం చేశారు. 

తెలంగాణ ప్రభుత్వ లోకాయుక్త జస్టిస్ సివి రాములు ముఖ్యఅతిధిగా పాల్గొంటూ స్వామి వివేకానంద జీవన కార్యాంను పూర్తి చేయడం కోసం ఒక సజీవ స్మారక కేంద్రంగా వివేకానంద శిల నెలకొన్నదని చెప్పారు. స్వామిజి లక్ష్యాలను ఆచరణలో తీసుకు రావడం కోసం ఎకనాథ్ రానిదే ఒక మహోత్తరమైన సంస్థను, ఉద్యమాన్ని వివేకానంద కేంద్ర రూపంలో ఏర్పాటు చేసారని కొనియాడారు. న్యాయవాది విజయభారతి కార్యక్రమం నిర్వహించారు.