2030 నాటికి మూడో  స్థానంలో ఆర్ధిక వ్యవస్థ 

మన దేశ ఆర్థిక వ్యవస్థ 2025 నాటికి ప్రపంచంలో ఐదో స్థానానికి వృద్ధి చెందుతుందని, 2030 నాటికి మూడో స్థానాన్ని ఆక్రమిస్తుందని  సెంటర్ ఫర్ ఎకనమిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్ (సీఈబీఆర్) తాజా నివేదికతో   తెలిపింది.   
 
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ భారత దేశంపై కూడా తీవ్ర ప్రభావం చూపించడంతో మన దేశ ఆర్థిక వ్యవస్థ 2019లో ప్రపంచంలో ఐదో స్థానంలో ఉండగా, 2020లో 6వ స్థానానికి క్షీణించింది. కన్సల్టెన్సీ గ్రూప్ సీఈబీఆర్ లండన్ కేంద్రంగా పని చేస్తోంది. 193 దేశాల ఆర్థికాభివృద్ధిపై ఏటా నివేదికను రూపొందిస్తుంది.
తాజాగా విడుదల చేసిన నివేదికలో ఆసక్తికర విషయాలను వెల్లడించింది. అనుకున్నదాని కన్నా వేగంగా చైనా వృద్ధి చెందుతోందని, అమెరికాను ఈ దశాబ్దంలోనే అధిగమిస్తుందని తెలిపింది. కోవిడ్-19 మహమ్మారి నుంచి అమెరికా కన్నా చైనా వేగంగా కోలుకుంటోందని తెలిపింది.

మన దేశ ఆర్థిక వ్యవస్థ 2019లో బ్రిటన్‌ను వెనుకకు నెట్టి ఐదో స్థానానికి చేరిందని శనివారం విడుదలైన సీఈబీఆర్ వార్షిక నివేదిక పేర్కొంది.  అయితే 2020లో బ్రిటన్ మళ్ళీ ఐదో స్థానానికి చేరడంతో మన దేశం 6వ స్థానానికి పతనమైందని తెలిపింది.

కోవిడ్-19 మహమ్మారి ప్రభావంతో భారత దేశం కాస్త గాడి తప్పిందని, ఫలితంగా 2019లో బ్రిటన్‌ను అధిగమించిన తర్వాత, మళ్ళీ బ్రిటన్ ఈ ఏడాది భారత్‌ను అధిగమించిందని పేర్కొంది. భారత్ ఈ స్థానాన్ని ఆక్రమించే వరకు అంటే, 2024 వరకు బ్రిటన్ 5వ స్థానంలో ఉంటుందని అంచనా వేసింది.

భారత దేశ కరెన్సీ రూపాయి విలువ బలహీనపడినందు వల్ల ఆ దేశాన్ని బ్రిటన్ అధిగమించినట్లు కనిపిస్తోందని పేర్కొంది. భారత దేశ ఆర్థిక వ్యవస్థ 2021లో 9 శాతం, 2022లో 7 శాతం వృద్ధి చెందే అవకాశం ఉందని తెలిపింది. భారత దేశం ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందిన దేశం కాబోతోందని పేర్కొంది.

వార్షిక జీడీపీ వృద్ధి 2035లో 5.8 శాతం ఉంటుందని అంచనాలు వెల్లడిస్తున్నాయని తెలిపింది. 2030నాటికి భారత దేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో మూడో స్థానానికి చేరే అవకాశం ఉందని తెలిపింది. 2025లో బ్రిటన్‌ను, 2027లో జర్మనీని, 2030లో జపాన్‌ను అధిగమించి మూడో స్థానానికి భారత్ చేరుతుందని అంచనా వేసింది. 

చైనా ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో నెంబర్ వన్ స్థానానికి 2028లో చేరుతుందని అంచనా వేసింది. అమెరికాను మించి చైనా అభివృద్ధి చెందే అవకాశం ఉందని తెలిపింది. కోవిడ్-19 మహమ్మారి నుంచి ఈ రెండు దేశాలు కోలుకోవడంలో వ్యత్యాసాలున్నట్లు వివరించింది. అంతకుముందు అంచనాలకు విరుద్ధంగా ఐదేళ్ళు ముందుగానే చైనా నెంబర్ వన్ స్థానానికి చేరే అవకాశాలు కనిపిస్తున్నట్లు తెలిపింది.