జమిలి ఎన్నికలకు కృతనిశ్చయంతో బిజెపి   

జమిలి ఎన్నికలకు కృతనిశ్చయంతో బిజెపి   
దేశంలో జమిలీ ఎన్నికలు తీసుకువచ్చేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కృతనిశ్చయంతో ఉన్నట్లు కనిపిస్తున్నది. ఏకకాల ఎన్నికల విషయంలో ప్రజలు, రాష్ట్రాల్లో ఏకాభిప్రాయం కల్పించడానికి త్వరలో వెబినార్‌ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నది.
 
దేశవ్యాప్తంగా కనీసం 25 వెబినార్లు జరుపాలన్న నిర్ణయంతో బీజేపీ పనిచేస్తున్నట్లుగా తెలుస్తున్నది. మాదిరి  ప్రవర్తనా నియమావళికి ఆటంకం కలిగించే అభివృద్ధి పనులను చేపట్టడంలో ఉన్న అడ్డంకిని తొలగిస్తుందనే కారణంతో గత కొన్ని సంవత్సరాలుగా లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు జమిలీ ఎన్నికలు నిర్వహించడానికి ప్రధాని నరేంద్ర మోదీ ముందుకొచ్చారు. 
 
తరచుగా ఎన్నికలకు వెళ్తుండటంతో అభివృద్ది పథకాల అమలుతోపాటు ప్రభుత్వాలు పథకాలతోపాటు కొత్త ప్రకటనలు చేయకుండా ఎన్నికల కమిషన్‌ ఆంక్షలు విధిస్తుంది. ఫలితంగా ఎన్నికలు పూర్తయ్యేంత వరకు పనులు నిలిచిపోవాల్సిన అగంత్యం ఏర్పడటం వల్ల అభివృద్ధిలో వెనుకబడిపోతున్నదనే విమర్శలు వస్తున్నాయి. 
 
జమిలీ ఎన్నికలు తీసుకురావడం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజల్లో అవగాహన కలిగించాలని బీజేపీ నిర్ణయించింది. ఈ వెబినార్లలో పార్టీ సీనియర్‌ నాయకులతోపాటు విద్యావేత్తలు, న్యాయనిపుణులు హాజరై ప్రసంగించేలా బీజేపీ కార్యాచరణ రూపొందిస్తున్నది.
 
2014 లో అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రధాని మోదీ ఏకకాలంలో ఎన్నికలను చేపట్టడాన్ని సమర్థించారు. ఇటీవల 80 వ అఖిల భారత ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ ముగింపు సమావేశంలో ప్రసంగించిన ప్రధాని మోదీ.. ఒక దేశం, ఒక ఎన్నిక ఆవశ్యకతను నొక్కిచెప్పారు. ప్రతి కొన్ని నెలలకొకసారి ఎన్నికలు జరుగుతున్నందున జమిలీ ఎన్నికల విధానం తీసుకురావడం ప్రస్తుతం అవసరమని ఎత్తిచూపారు. 
 
“ప్రతి కొన్ని నెలలకు ఎన్నికలు వేర్వేరు ప్రదేశాల్లో జరుగుతున్నాయి. అభివృద్ధి పనులపై ఎన్నికల ప్రభావం అందరికీ తెలుసు. అందువల్ల, ‘ఒక దేశం, ఒక ఎన్నిక’ పై లోతైన అధ్యయనం, చర్చలు జరపడం తప్పనిసరి” అని మోదీ చెప్పారు. 
 
2016 లో ‘ఏకకాల ఎన్నికల విశ్లేషణ: ఎందుకు? ఏమిటి? ఎలా?’ అనే చర్చలో ఏకకాల ఎన్నికల ఆలోచనకు నీతి ఆయోగ్‌ మద్దతు తెలిపింది. తరచూ ఎన్నికలు విధాన రూపకల్పన దృష్టిని మారుస్తాయని పేర్కొన్నది. ప్రతి సంవత్సరం రెండు నుంచి ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించే బదులుగా.. 30 నెలల వ్యవధిలో రెండు సార్లు ఎన్నికలు జరిపాలన్న ప్రతిపాదన ముందుకు వచ్చింది. 
 
లోక్‌సభతో పాటు 14 రాష్ట్రాలు ఎన్నికలకు వెళ్లాలని, రెండున్నర సంవత్సరాల తర్వాత రెండో దశలో మిగిలిన రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుపడం శ్రేయస్కరం అన్న ప్రతిపాదనపై చర్చ జరిపి ప్రజలు, విద్యావేత్తలు, నిపుణుల అభిప్రాయాలు తెలుసుకోనున్నారు.