నెల్లూరుకి చెందిన సీనియర్ ఆర్ ఎస్ ఎస్ కార్యకర్త నాగారెడ్డి హరి కుమార్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ ప్రాంత సంఘచాలక్ (రాష్ట్ర అధ్యక్షులు) గా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రాంత సంఘచాలక్ నియుక్తి కోసం ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరగడం ఆనవాయితీ.
మంగళగిరి మండలం నూతక్కి విజ్ఞాన విహార పాఠశాలలో జరిగిన ఆంధ్ర ప్రదేశ్ ప్రాంత సమావేశాలలో సంఘచాలక్ ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలలో ఆర్ ఎస్ ఎస్ లో అత్యున్నత శిక్షణ అయిన తృతీయ వర్ష సంఘ శిక్షావర్గలో శిక్షణ పొందిన బాధ్యత కలిగిన కార్యకర్తలు ప్రాంత సంఘచాలక్ ను ఎన్నుకుంటారు. అందులో భాగంగానే ఈ ఎన్నిక జరిగింది.
హరికుమార్ రెడ్డి స్వగ్రామం నెల్లూరు జిల్లా కోవూరు మండలం వేగూరు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన హరికుమార్ రెడ్డి అగ్రికల్చరల్ ఎం ఎస్ సీ పట్టభద్రులు. 1967వ సంవత్సరంలో వారి విద్యార్థి దశలో నెల్లూరులోని కస్తూరి దేవి నగర్ లో అప్పుడు ఉండిన విక్రమ శాఖ ద్వారా వారు ఆర్ ఎస్ ఎస్ కార్యకర్త అయ్యారు.
నెల్లూరు జిల్లా కార్యవాహ, నెల్లూరు విభాగ్ (నెల్లూరు, చిత్తూరు జిల్లాలు) కార్యవాహ, నెల్లూరు విభాగ్ సంఘచాలక్, ప్రాంత కార్యకారిణీ సదస్యులుగా వివిధ బాధ్యతలలో వారు ఆర్ ఎస్ ఎస్ కార్య విస్తరణకు విశేష కృషి సలిపారు. కార్యకర్తలందరి ఆకాంక్ష మేరకే తాను ఈ బాధ్యతను స్వీకరించానని, కార్యకర్తల అభీష్టం, అంచనాల మేరకు ఆంధ్రప్రదేశ్ లో సంఘ కార్య విస్తరణకు యధాశక్తి కృషి చేస్తానని ఈ సందర్భంగా హరికుమార్ రెడ్డి తెలిపారు.
More Stories
బుడమేరుకు మళ్లీ వరద ముప్పు
ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం
ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక