
రైతు బిల్లులతో మార్కెట్ యార్డ్ లను మూసేస్తారన్నది దుష్ప్రచారం మాత్రమేనని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి ధ్వజమెత్తారు. రైతు బిల్లులపై ప్రతిపక్షాలన్నీ ఏకమై రాజకీయం చేస్తున్నాయని ఆమె దయ్యబట్టారు. అన్నదాతలు ఢిల్లీ రహదారుల్లో అలుపెరుగని పోరాటం చేస్తున్న నేపథ్యంలో.. విశాఖలోని మీడియా సమావేశంలో దగ్గుబాటి పురంధేశ్వరి మాటలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
మార్కెట్ యార్డ్‌లలో కనీస మౌలిక వసతులు, కనీస మద్దతు ధర, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయం వంటి అంశాలే రైతు బిల్లుల ప్రధాన ఉద్దేశమని ఆమె చెప్పారు. కాంట్రాక్ట్ ఫార్మింగ్ కొత్త అంశం కాదని, దేశంలో ఇప్పటికే అమలులో ఉందని, దానిలో సంస్కరణలు తేవడానికి చట్టాలు చేశామని తెలిపారు.
రైతుల ఉత్పత్తికి రక్షణ, అసంఘటిత రైతులకు పింఛన్ కల్పించదానికే బిల్లులు తెచ్చామన్నారు. రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయడమే ప్రధాని మోడీ లక్ష్యమని చెప్పుకొచ్చారు. పంట నష్టపోయిన నెల రోజుల్లోనే పరిహారం అందేలా ఫసల్ యోజన పథకాన్ని తెచ్చారని ఆమె చెప్పారు.
నినాదాలకు పరిమితం కాకుండా సంస్కరణలు తెచ్చామని పురందేశ్వరి పేర్కొన్నారు. స్వామినాథన్ కమిటీ రిపోర్ట్‌పై విపక్షాలు అప్పట్లో ఎందుకు దఅష్టి సారించలేదని పురంధేశ్వరి ప్రశ్నించారు. బిల్లులో మార్పులు, చేర్పులకి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, చర్చలకు ప్రధాని కూడా సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ స్కాలర్‌షిప్ వివరాలు రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి వివరాలతో పంపితే వెంటనే మంజూరు చేస్తామని ఆమె స్పష్టం చేశారు. ఎపిలో వైసిపి ప్రైవేటు కాలేజీల్లో చదివే ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల స్కాలర్ షిప్‌ను రద్దు చేస్తూ నిర్ణయాన్ని తీసుకోవడం దుర్మార్గమని దుయ్యబట్టారు.
పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చామని వైసిపి చెబుతోందని కానీ సైట్ పొజిషన్ సర్టిఫికెట్ మాత్రమే ఇచ్చినట్టు తమ దఅష్టికి వచ్చిందని పురంధేశ్వరి పేర్కొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వాతావరణం లేక పెట్టుబడిదారులు వెనక్కి వాపోతున్నారని విచారం వ్యక్తం చేశారు. దీనికి వైసిపి ప్రభుత్వ తీరే కారణమని ధ్వజమెత్తారు.
అమరావతిపై విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా… రాజధాని అమరావతి విషయం కోర్టులో ఉందని, దీనిపై స్పందించడం సరికాదని చెప్పారు. దీనిపై బిజెపి వైఖరిని సోము వీర్రాజు ఇప్పటికే స్పష్టం చేశారని తెలిపారు. తిరుపతి ఉప ఎన్నిక పై రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో ముందుకు వెళతామని పురంధేశ్వరి పేర్కొన్నారు.
More Stories
ఏపీలో శ్రీకాకుళంలో కొత్తగా ఎయిర్ పోర్ట్
తిరుమలలో హిందువులు మాత్రమే పనిచేయాలి
అసెంబ్లీకి దొంగల్లా వచ్చి వెళ్లడం ఏంటి?