
ఢిల్లీ వేదికగా కొందరు ప్రతి రోజూ తనకు ‘ప్రజాస్వామ్య పాఠాలు’ చెప్పడానికి ప్రయత్నిస్తున్నారని పరోక్షంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి ప్రధాని మోదీ చురకలంటించారు. ఢిల్లీ వేదికగా ప్రతిరోజూ తనను విమర్శిస్తున్నారని, వారందరూ జమ్మూకశ్మీర్‌ను చూసి నేర్చుకోవాలని హితవుపలికారు.
జమ్మూ కశ్మీర్ ప్రజల నిమిత్తమై ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ శనివారం ప్రారంభిస్తూ ప్రజాస్వామ్యం ఎంత బలీయమైనవో జమ్మూ కశ్మీర్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు చూపించాయని సంతోషం వ్యక్తం చేశారు. ఢిల్లీ వేదికగా రోజూ నన్ను అవమానించాలని, నాకు ప్రజాస్వామ్య పాఠాలు చెప్పాలని చూస్తున్నారని ధ్వజమెత్తుతూ వారి కపటత్వం, పవిత్రతను ఓ సారి చూడండని చెప్పారు. సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినా వారు పాండిచ్చేరిలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించలేదని గుర్తు చేశారు.
కేంద్ర పాలిత ప్రాంతంగా జమ్మూ కశ్మీర్‌ను ప్రకటించగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించామని చెప్పారు. జమ్మూ కశ్మీర్ లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలను ఓసారి చూడాలని ఆయన కోరారు. ప్రజాస్వామ్యానికి ఆ ఎన్నికలు ఓ ఉదాహరణ అంటూ పరోక్షంగా రాహుల్ గాంధీ అన్న వ్యాఖ్యలకు ప్రధాని మోదీ కౌంటర్ ఇచ్చారు.
గాంధీ సిద్ధాంతమైన గ్రామ స్వరాజ్యానికి తగినట్లు జమ్మూకశ్మీర్ సాధించిందని ప్రధాని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ పీఎం-జేఏవై ఎస్ఈహెచ్ఏటీ స్కీమ్‌ను ప్రారంభిస్తూ గతంలో కశ్మీర్‌లో కూటమి ప్రభుత్వంలో ఉన్నామని, కానీ ఇప్పుడు ఆ కూటమి వీగిపోయిందని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికలు జరగాలని, ప్రజలకు వారివారి హక్కుల్ని కల్పించడమే తమ ఉద్దేశమని ప్రధాని తెలిపారు.
More Stories
వరల్డ్ ఆడియో విజువల్ సదస్సుపై ప్రధాని మోదీ భేటీ
అభివృద్ధి, సుపరిపాలనే గెలిచింది
ఢిల్లీలో ఆప్ ఓటమికి కేజ్రీవాల్ కారణం