వ్యవసాయ చట్టాలపై ఒకటి రెండేళ్లు చూడండి 

కేంద్ర వ్యవసాయ చట్టాలపై ఆందోళనలను సాగిస్తున్న రైతులు ఒకటి రెండేళ్ల పాటు ఆ చట్టాలను అమలు కానీయాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కోరారు. రైతులకు అనుకూలంగా చట్టాలు లేవని అప్పుడు వారికి అనిపిస్తే అవసరమైన సవరణలను కేంద్రం చేపడుతుందని హామీ ఇచ్చారు.

‘ఒకటి రెండేళ్లు ఈ చట్టాలను అమలుకానీయండి. చట్టాలు తమకు అనుకూలంగా లేవని అప్పుడు వారికి అనిపిస్తే తప్పని సరిగా ప్రభుత్వం చట్టాల్లో మార్పులు చేస్తుంది. మన ప్రధాని మనసు ఏమిటో బాగా తెలిసిన వ్యక్తిగా నేను చెబుతున్నారు. చట్టాల్లో అవసరమైన అన్ని మార్పులు తప్పనిసరిగా చేస్తాం’ అని ఢిల్లీలోని ద్వారకలో జరిగిన ఒక కార్యక్రమంలో రాజ్‌నాథ్ మాట్లాడుతూ చెప్పారు. 

కనీస మద్దతు ధరకు ఢోకా ఉండదని ప్రధాని భరోసా ఇచ్చిన విషయాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ఎంఎస్‌పీకి తిలోదకాలు ఇస్తారనే ఆలోచనలు పూర్తిగా సత్యదూరమని స్పష్టం చేశారు. 

కాగా, రైతులు తమ ఆందోళనలు విరమించి ప్రభుత్వంతో చర్చలకు రావాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మరోమారు రైతులకు తోమర్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఇస్తున్న సొమ్ము నేరుగా రైతుల అకౌంట్లలోకి చేరుతుండటం ఇవాళ మనం చూస్తున్నామని, ఇందువల్ల రైతులకు ఎంతో లబ్ధి చేకూరుతోందని ఆయన పేర్కొన్నారు. 

కొత్త చట్టాల ప్రాధాన్యతను రైతులు అర్ధం చేసుకుని ప్రభుత్వంతో చర్చలకు రావాలని కోరారు. త్వరలో సమస్య పరిష్కారమవుతుందన్న అశాభావాన్ని తోమర్ వ్యక్తం చేశారు.