బ్యాంకుల ముందు చెత్త ….. నిర్మలా సీరియస్ 

సంక్షేమ పథకాలకు రుణాలు మంజూరు చేయడం లేదంటూ ఏపీలో బ్యాంకుల ముందు చెత్త పోయడాన్ని బ్యాంకర్లు సీరియ్‌సగా తీసుకుంటున్నారు. సోమవారం ఏదో ఒక రూపంలో తమ నిరసన వ్యక్తం చేయాలని భావిస్తున్నారు. విజయవాడ, మచిలీపట్నం, ఉయ్యూరుల్లోని బ్యాంకుల ముంగిట చెత్తను గుమ్మరించిన ఘటనపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఇప్పటికే తీవ్రంగా స్పందించారు. 

ఈ విషయమై రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డితో మాట్లాడినట్లు ఆమె ట్విట్టర్‌లో తెలిపారు. బ్యాంకు గుమ్మాల ముందు చెత్తపోసిన ఫొటోలను కూడా ఆమె పోస్ట్‌ చేశారు. దీంతో ఈ విషయం జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసింది. 

‘ఏపీలో ఇలా జరుగుతోందా’ అంటూ బ్యాంకర్లు, ఆర్థిక నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇలా జాతీయ స్థాయిలో పరువు పోతున్నా రాష్ట్ర సర్కారు దీనిని తేలిగ్గానే తీసుకుంటోంది. రుణాలు అందని పథకాల లబ్ధిదారులే ఇలా నిరసన వ్యక్తం చేశారనే వాదనకే ఉన్నతాధికారులు కట్టుబడి ఉన్నారు.

కానీ కృష్ణా  జిల్లాలో ఒకే రోజున విజయవాడ, మచిలీపట్నం, ఉయ్యూరులలో ఒకేరోజు బ్యాంకు శాఖల ముందు చెత్తపోయడం యాదృచ్ఛికంగా జరిగింది కాదని,  ‘ఉన్నతస్థాయి’ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే మునిసిపాలిటీ పారిశుధ్య సిబ్బంది ఈ పని చేశారని బ్యాంకర్లు భావిస్తున్నారు. ఉయ్యూరులో ‘నగరపంచాయతీ కమిషనర్‌’ పేరిట బ్యానర్లు ఉంచడమే దీనికి నిదర్శనమని చెబుతున్నారు.

జగనన్న తోడు, వైఎస్సార్‌ చేయూత, సీఎం స్వానిధి తదితర పథకాల విధివిధానాల్లో స్పష్టత లేకపోవడం, సిబ్బంది కొరత కారణంగానే రుణాలివ్వడంలో జాప్యం జరుగుతోందే తప్ప ఇందులో ఉద్దేశపూర్వక అలసత్వం లేదని వివిధ సమావేశాల్లో స్పష్టం చేస్తున్నప్పటికీ ఇలాంటి చెత్త చర్యలకు పాల్పడటాన్ని బ్యాంకర్లు ఖండిస్తున్నారు.

జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైన ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందోనన్న ఆసక్తి నెలకొంది. క్రిస్మస్‌ సెలవుల అనంతరం ఏదో ఒక రూపంలో తమ నిరసనను వ్యక్తం చేయాలని బ్యాంకుల ఉద్యోగులు, అధికారులు యోచిస్తున్న నేపథ్యంలో బాధ్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకోక తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.