మోదీకి మాత్రమే పేరొస్తుందని వాళ్ల భయం

మోదీకి మాత్రమే పేరొస్తుందని వాళ్ల భయం

కొత్త వ్యవసాయ చట్టాలతో ప్రధాని మోదీకి  మాత్రమే పేరొస్తుందనే భయంతో ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ధ్వజమెత్తారు.  కాలం చెల్లిన, బూజు పట్టిన చట్టాలను తొలగించి పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా కొత్త చట్టాలు తీసుకువస్తున్నామని స్పష్టం చేశారు. 

నూతన వ్యవసాయ చట్టాలతో రైతులకు లాభమే కానీ నష్టం లేదని భరోసా ఇచ్చారు. కృత్రిమ ఉద్యమాలతో టీఆర్ఎస్ నాయకులు రైతులను మోసం చేయాలని చూస్తున్నారని విమర్శించారు.  ప్రతిపక్షాలు కొత్త చట్టాలపై తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు. బహిరంగ మార్కెట్లో అందరూ తమకు నచ్చిన ధరలకు అమ్ముకుంటుంటే  రైతులకు మాత్రమే ఎందుకు నిబంధనలు ఉండాలని ఆయన ప్రశ్నించారు. రైతులకు ఉపయోగపడేలా ఉండే ఓపెన్ మార్కెట్ సిస్టంను ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయని నిలదీశారు.

ప్రజలకు లాభం చేకూర్చేలా చట్టాలను సవరించి తీసుకువస్తామని చెప్పారు. ఆ విధంగా వచ్చినవే ఈ మూడు వ్యవసాయ చట్టాలని తెలిపారు. పార్లమెంట్లో అందరితో చర్చించిన తర్వాతనే, నూతన చట్టాలను తీసుకువచ్చామని స్పష్టం చేశారు. అంబానీ, ఆదానీలు ఇప్పుడే ఢిల్లీకి వచ్చారా?.. 2014 మే 26 కు ముందు లేరా అని ప్రశ్నించారు. 

కాగా, తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీ ఉంటుందని పేర్కొన్నారు. బీజేపీని అధికారంలోకి తెచ్చేలా ముందుకు సాగుతామని తెలిపారు. నిజమాబాద్  కవిత, దుబ్బాక ఎన్నికల్లో హరీష్ రావు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేటీఆర్ లకు ప్రజలు బుద్ధి చెప్పారని గుర్తు చేశారు. 

 కేసీఆర్ మార్చిలో కొడుకుకు పట్టాభిషేకం చేసే ప్లాన్‌లో ఉన్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ నిరంకుశ విధానాలతో ప్రజలు విసిగి పోతున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో సీఎం కేసీఆర్ ఘోరంగా ఫెయిలయ్యారని పేర్కొన్నారు. 2023 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరవేస్తామని రఘునందన్‌రావు ధీమా వ్యక్తం చేశారు.