బిజెపి ప్రభంజనంను మమతా తట్టుకోగలరా!  

స్వతంత్ర ఉద్యమ కాలంలో ఒక వంక విప్లవ ఉద్యమాలకు, జాతీయ ఉద్యమాలకు, మరోవంక సాంఘిక సంస్కరణ ఉద్యమాలకు, శాస్త్రీయ – పారిశ్రామిక అభివృద్ధికి కేంద్రంగా, బ్రిటిష్ పాలకులకు చాలాకాలం రాజధానిగా కొనసాగిన పశ్చిమ బెంగాల్ స్వతంత్ర భారత దేశంలో వెనుకబడిన ప్రాంతగానే కాకుండా రాజకీయ హింసకు నెలవుగా మారింది. 
 
తీవ్రమైన అశాంతి నెలకొనడంతో ప్రసిద్ధి చెందిన బిర్లా నుండి అనేకమంది పారిశ్రామిక వేత్తలు తమ వ్యాపారాలను ఇతర ప్రాంతాలకు తరలించారు. కొత్తగా పారిశ్రామిక వేత్తలు ఎవ్వరు అటువైపు చూడటం లేదు.  రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద,  మహర్షి అరవింద, లాలా లజపతి రాయ్, జగదీశ్ చంద్రబోస్, ఈశ్వర్ చంద్ విద్యాసాగర్, సుభాష్ చంద్రబోస్, శ్యామ్ ప్రసాద్ ముఖేర్జీ వంటి భారత జాతి గమనంపై విశేషమైన ప్రభావం చూపిన నేతలు ఇక్కడి నుండి వచ్చిన వారే. 
 
కానీ స్వతంత్రం భారత దేశంలో గత 70 ఏళ్లుగా పశ్చిమ బెంగాల్ అన్ని రంగాలలో ఎందుకు వెనుకబడుతూ వస్తుంది? ఆ రాష్ట్రంకు  రావాలి అంటే పారిశ్రామిక వేత్తలే కాకుండా సాధారణ ఉద్యోగులు సహితం కూడా ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు? ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా రాష్ట్రంలో పరిస్థితులను ఎందుకు మార్చలేక పోతున్నారు? 
 
గత 70 ఏళ్లుగా ఆ రాష్ట్రాన్ని ముఖ్యంగా మూడు రాజకీయ పార్టీలు పాలించాయి. మొదట కాంగ్రెస్, తర్వాత సిపిఎం, ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్. 1977 వరకు జరిగిన కాంగ్రెస్ పాలనలో నక్సలైట్ల హింసకు రాష్ట్రాభివృద్ధి స్తంభించి పోయింది. రాజకీయ అస్థిరతకు దారితీసింది. 1968 నుండి 1971 వరకు నాలుగు సార్లు అక్కడ రాష్ట్రపతి పాలన విధింప వలసి వచ్చింది. 
 
1977లో సిపిఎం నాయకత్వంలో వామపక్ష కూటమి అధికారమలోకి వచ్చి 34 ఏళ్లపాటు సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగినా  సుస్థిర పాలన అందించలేక వాపోయారు. అడ్డుఅదుపు లేని రాజకీయ హింస అక్కడ అభివృద్ధికి అడ్డంకిగా మారింది. ముఖ్యమంతృలుగా పనిచేసిన జ్యోతిబసు, బుద్దదేబ్ భట్టాచార్య ఉదారవాదులుగా ప్రపంచానికి కనిపించినా వారి ఏలుబడిలో అన్ని ప్రభుత్వ విభాగాలు పార్టీ విభాగాలుగా మారిపోయాయి. 
 
చట్టబద్ధ పాలన అంటూ లేకపోయింది. కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు సహితం వీధులలో కమ్యూనిస్టులతో  పోరాడుతున్నా కేంద్రంలో మాత్రం వారితో సయోధ్య జరుపుతూ వస్తూ ఉండెడివి. కాంగ్రెస్ పార్టీలోని ఈ ధోరణిపై అసహారంతో తిరుగుబాటు చేసి, బైటకు వచ్చి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన మమతా బెనర్జీ ఒక విధంగా కమ్యూనిస్టుల అరాచకాలపై  పోరాటాలు జరిపారు. 
 
వీధి పోరాటాలతో కమ్యూనిస్ట్ లను ఓడించి పదేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన మమతా సహితం వారికన్నా భిన్నమైన పాలన అందించలేక పోయారు. రాష్ట్రాభివృద్ధిపై దృష్టి సారింపలేక పోయారు. పైగా రాజకీయ హింస, అవినీతిలకు ఆమె మతపర రాజకీయాలను జోడించారు. 27.5 శాతంగా ఉన్న ముస్లిం ఓట్ బ్యాంకు కోసం ఆమె మతపర రాజాకీయాలను జోడించి రాష్ట్రం మొత్తాన్ని రావణకాష్టంగా మార్చారు. 
 
సహజంగానే ఈ పరిస్థితులు రాష్ట్ర రాజకీయాలలో ఒక విధమైన సూన్యతను సృష్టించాయి. ఈ సూన్యతను భర్తీ చేయడంలో బిజెపి అనూహ్యమైన విజయం సాధించింది. రాష్ట్ర రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్న కాంగ్రెస్, వామపక్షాలు ప్రేక్షక పాత్రకు పరిమితం అయ్యేవిధంగా బిజెపి చేయగలిగింది. కేవలం ఐదేళ్ల వ్యవధిలో ఒక మహా శక్తిగా ఇక్కడ బిజెపి ఎదిగింది. 
 
వ్యూహాత్మకంగా రాష్ట్రంలో 70 శాతంగా ఉన్న హిందువులపై బిజెపి దృష్టి సారించింది. మమతా పాలనలో వారేవిధంగా వివక్షతకు గురవుతున్నారో తెలియచెప్ప గలిగింది. దానితో గత ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికలలో 40. 64 శాతం ఓట్లు సంపాదించి మొత్తం 42గా ఉన్న లోక్ సభ స్థానాలలో 18 స్థానాలను గెలుచుకో గలిగింది. 43.69 శాతం ఓట్లు పొందిన తృణమూల్ కాంగ్రెస్ కన్నా కొంచెం మాత్రమే వెనుకబడి ఉండడం గమనార్హం.
 
ఈ ఫలితాలు బీజేపీలో కొత్త ఆశలు చిగురింప చేశాయి. మరోవంక అధికార పక్షంలో ప్రకంపనాలు సృష్టించాయి. రాజకీయంగా మమతా నిలదొక్కుకోవడం కష్టం అనే సందేశం పంపాయి. తన పాలనపై మరింతగా దృష్టి సారించి, ప్రజలపై పట్టు పెంచుకొనే ప్రయత్నం చేయకుండా రాజకీయంగా బిజెపిని ఎదుర్కోవడం కోసం గతంలో సిపిఎం హయాంలో వలే వీధి రాజకీయాలకు మమతా దిగే ప్రయత్నం చేయడం ఆమెకే చేటు తెచ్చే పరిస్థితులకు దారితీస్తున్నాయి. 
 
ఇదివరకే ముకుల్ రాయ్ వంటి కీలక నేతలు టిఎంసి నుండి బీజేపీలో చేరగా తాజాగా గత వారం మాజీ మంత్రి, కీలక నేత సువేందు అధికారితో పాటు ఏకంగా 11 మంది ఎమ్యెల్యేలు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరడంతో రాష్ట్ర రాజకీయాలలో కలకలంకు దారితీసింది.
మరో ఐదారు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న సమయంలో ఇటువంటి పరిణామం మమతకు కోలుకోలేని  దెబ్బ అని చెప్పవచ్చు. ఎన్నికల నాటికి చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు టీఎంసీని వీడి బీజేపీలో చేరతారని, చివరికి మమత మాత్రమే ఆ పార్టీలో మిగులుతారని అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలు తమ దూకుడుకు మమతా తట్టుకోలేరని స్పష్టమైన సంకేతం ఇచ్చిన్నట్లు అయింది.
అంతకు ముందు బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా  పర్యటన సందర్భంగా ఆయనపై దాడికి ప్రయత్నం జరగడాన్ని బిజెపి చాలా తీవ్రమైన అంశంగా తీసుకొని, వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులు ఒక విధంగా మమతను ఊపిరి పీల్చుకోలేకుండా చేస్తున్నది.
రాష్ట్రంలోని 294 అసెంబ్లీ స్థానాలలో గత ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికలలో 125 స్థానాలలో బిజెపి ఆధిక్యత సంపాదించింది. మరో 25 స్థానాలపై పట్టు సంపాదిస్తే ఇక అధికారంలోకి రావడమే అనే ధీమా ఆ పార్టీ నేతలలో ఏర్పడింది. అందుకనే నడ్డా నుండి బిజెపి నేతలు అందరు 200 సీట్లు గెలుస్తాం అంటూ ప్రకటనలు చేస్తున్నారు.
మీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవ్వరో చెప్పండి అంటూ మమతాను ఢీ కొనే నేత లేరనే ప్రచారం టిఎంసి సాగిస్తున్నది. అయితే ప్రధాని నరేంద్ర మోదీ పట్ల ప్రజలలో ఏర్పడిన విశ్వాసం, ఆకర్షణలు పోటీగా బిజెపి తీసుకు వస్తూ ఉండడమతొ మమతా ఆత్మరక్షణలో పడుతున్నారు.
గతంలో ఉత్తర ప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో కూడా ముఖ్యమంత్రి అభ్యర్హ్ది అంటూ ఎవ్వరు లేకుండా బిజెపి గెలుపొంది, అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు బెంగాల్ లో సహితం అటువంటి వ్యూహాలనే ఆశ్రయిస్తున్నది. అయితే వీధి పోరాటాలలో ఆరితేరిన మమతా అంత తేలికగా ఓటమి అంగీకరిస్తోందని అనుకోలేము. అందుకనే ఎన్నికలు సమీపించే సరికి హింసా రాజకీయాల్లో బెంగాల్ లో చుట్టుముడుతున్నాయి.
ఎన్సీపీ అధినేత శరద్ పవర్, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, డీఎంకే అధినేత ‌ ఎంకే స్టాలిన్‌, శివసేన అధినేత సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేతో పాటు కాంగ్రెస్‌ పాలిత ముఖ్యమంత్రులను ఆహ్వానించడం ద్వారా భారీ స్థాయిలో బిజెపి వ్యతిరేక ర్యాలీ జరపడం ద్వారా రాష్ట్ర రాజకీయాలలో తన స్థానం సుస్థిరం చేసుకోవాలని మమతా ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. అయితే 2019 ఎన్నికల ముందు కూడా ఇటువంటి ర్యాలీ జరిపినా అక్కడ బిజెపి ప్రభంజనాన్ని పెద్దగా అడ్డుకోలేక పోవడం గమనించాలి.
త్వరలో పౌరసత్వ సవరణ చట్టం అమలు చేపట్టనున్నట్లు బెంగాల్ పర్యటన సందర్భంగా అమిత్ షా ప్రకటించడం సహితం విశేష ప్రాముఖత సంతరింప చేసుకొంది. బాంగ్లాదేశ్ ఏర్పాటు సమయంలో శరణార్థులుగా వచ్చిన కోటిమందికి పైగా ప్రజలు పౌరసత్వంకోసం ఎదురు చూస్తున్నారు. వారికి పౌరసత్వం ఈ లోగా కల్పించ గలిగితే బిజెపి పెద్ద ఓట్ బ్యాంకు గా మారే అవకాశం ఉంది. పౌరసత్వ చట్టం సవరణను వ్యతిరేకిస్తున్న టిఎంసి, కాంగ్రెస్, సిపిఎం లకు వారు ఓట్ వేసే అవకాశం ఉండదు.
చివరకు కరోనా సమయం నుండి గడ్డం పెంచుతున్న ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు రవీంద్రనాథ్ టాగోర్ ఆకారంలో కనిపిస్తున్నారు. ఒక విధంగా బెంగాల్ ఓటర్లను ప్రభావితం చేయడం కోసమే ఆయన ఆ విధంగా ఉంటున్నరని కూడా చలామంది భావిస్తున్నారు. బెంగాల్ లో పాగా వేయడం కోసం గత అర్ధ శతాబ్ది కాలంలో ఏ జాతీయ రాజకీయ పార్టీ సహితం ఇంత పట్టుదలతో, వ్యూహాత్మకంగా అడుగులు వేయలేదు. ఈ ప్రభంజనంను తట్టుకొని మమతా ఏ మేరకు నిలబడగలరో చూడాలి.