దేశవ్యాప్తంగా ఒకేసారి బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు  

బుల్లెట్‌ రైలు ప్రాజెక్టును దేశవ్యాప్తంగా ఒకేసారి ప్రారంభిస్తామని, ఇందుకు అనుగుణంగా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు రైల్వేబోర్డు చైర్మన్‌ వీకేయాదవ్‌ వెల్లడించారు.  రైల్వేలైన్‌ నిర్మాణం కోసం ఇప్పటి వరకు 949 హెక్టార్ల భూమిని సేకరించినట్లు తెలిపారు. మహారాష్ట్రలో భూమి సేకరించాల్సి ఉందని, భూమి స్వాధీనం చేసుంటే తప్ప టెండర్లు ఆహ్వానించలేమని స్పష్టం చేశారు.
రైల్వేశాఖ మహారాష్ట్ర అధికారులతో అనేక సార్లు చర్చలు జరిపిందని, రాబోయే నాలుగు నెలల్లో రాష్ట్రంలో 80శాతం కంటే ఎక్కువగా భూసేకరణ పూర్తి కావచ్చని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. భూసేకరణ పూర్తయితే టెండర్లు ఆహ్వానిస్తే రెండు దశలు ఒకేసారి మొదలవుతాయని చెప్పారు. మహారాష్ట్రలో భూసేకరణ ఆలస్యమైతే మొదటి దశలో 325 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న వాపి (గుజరాత్‌) వరకు ప్రాజెక్టును ప్రారంభిస్తామని తెలిపారు. మహారాష్ట్రలో ప్రాజెక్టు కోసం ఇంకా 26శాతం భూమి కావాలని, ఇప్పటి వరకు 68శాతం స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.
508.17 కిలోమీటర్ల పొడవునా బుల్లెట్‌ రైల్‌ కారిడార్‌లో 155.76 కిలోమీటర్లు మహారాష్ట్రలో గుజరాత్‌లో 348.04 కిలోమీటర్లు, దాద్రా నగర్ హవేలీలో 4.3 కిలోమీటర్లు ఉండవచ్చని చెప్పారు. అలాగే దేశంలోని నాలుగు ప్రముఖ శైవ క్షేత్రాలను కలుపుతూ రైల్వేలైన్‌ నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు డీపీఆర్‌ సిద్ధం చేసినట్లు తెలిపారు.
2024 చివరికి రుషికేశ్‌ – కర్న్‌ ప్రయాగ్‌ రైలు లింక్‌ పూర్తి చేస్తామని, రామేశ్వరం ఆధునిక పంబన్‌ వంతెన 2021 అక్టోబర్‌ నాటికి పూర్తవుతుందని చెప్పారు.  ప్రస్తుతం 9 రూట్లలో కిసాన్‌ ప్రత్యేక రైళ్లు నడుస్తున్న రైల్వేబోర్డ్‌ చైర్మన్‌ పేర్కొన్నారు. ఇప్పటి వరకు 27వేల టన్నుల వ్యవసాయ ఉత్పత్తుల రవాణా చేశామని చెప్పారు. అలాగే డిసెంబర్‌ 2022 నాటికి తొలి లోకోమోటివ్‌ రైలు ప్రారంభమవుతుందని వివరించారు.