విదేశీ మారక నిల్వల్లో  పడిపోయిన డాలర్ వాటా  

ప్రపంచ విదేశీ మారక నిల్వల్లో అమెరికన్‌ డాలర్‌ వాటా ఈ ఏడాది భారీగా పడిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో గ్లోబల్‌ రిజర్వుల్లో 61.5 శాతంగా ఉన్న డాలర్‌ వాటా వరుసగా రెండు త్రైమాసికాల నుంచి తగ్గుతూ వస్తోందని ఐఎంఎఫ్‌ తాజాగా విడుదలజేసిన గణాంకాలు తెలియజేస్తున్నాయి. 
 
గ్లోబల్‌ రిజర్వులంటే వివిధ కరెన్సీలను కలిగిఉన్న కేంద్రబ్యాంకుల ఆస్తులే. రెండో త్రైమాసికంలో 61.2 శాతంగా ఉన్న డాలర్‌ వాటా మూడో త్రైమాసికానికి వచ్చేసరికి 60.4 శాతానికి తగ్గింది. 2020 సంవత్సరంలో మొత్తంగా డాలర్‌ వాటా 6.4 శాతం మేర క్షీణించిందని ఎఎంఎఫ్‌ వెల్లడించింది.
 
 డాలర్‌ వాటా ఇంతగా పడిపోవడం 2017 తరువాత ఇదే మొదటిసారి అని పేర్కొంది. అయినప్పటికీ కేంద్ర బ్యాంకుల్లో అత్యధిక నిష్పత్తి కలిగిన కరెన్సీగా డాలరే ఇప్పటికీ ఉంది.  గ్లోబల్‌ రిజర్వులో ఉన్న డాలర్లను కేంద్ర బ్యాంకులు తమ అప్పులను తీర్చుకోవడానికి వాడతాయి.ఒక్కోసారి తమ కరెన్సీ విలువ బాగా పడిపోతున్నప్పుడు, ఆ పతనాన్ని నిలువరించేందుకు ఈ నిల్వలను ఉపయోగిస్తాయి. 
 
గ్లోబల్‌ రిజర్వులో మూడో త్రైమాసికం నాటికి 12.254 లక్షల కోట్ల డాలర్లు ఉన్నాయి. డాలర్‌తో పోల్చినప్పుడు యూరో కరెన్సీ వాటా ఎలాంటి ఒడుదుడుకులకు గురి కాకుండా నిలకడగానే ఉన్నట్లు ఐఎంఎఫ్‌ పేర్కొంది. ఈ ధోరణి చూశాక డాలర్‌ తన ఆధిపత్యాన్ని కోల్పోతుందా అన్న సందేహాన్ని విశ్లేషకులు కొందరు వ్యక్తం చేశారు. భౌగోళిక రాజకీయాల్లో అగ్ర రాజ్యం ఇన్నాళ్లు చలాయించిన ఆధిపత్యానికి ఇటీవల గండిపడింది.
 
అమెరికా భారీ రుణ సంక్షోభంలో కూరుకుపోవడం, డాలర్‌కు ప్రత్యామ్నాయ కరెన్సీ ముందుకొస్తుండడంతో అమెరికన్‌ డాలర్‌ ఆధిపత్యం ఎంతో కాలం కొనసాగే పరిస్థితి లేదని రోజెన్‌బర్గ్‌ రిసెర్చి కేంద్రం చీఫ్‌ ఎకనామిస్ట్‌ డేవిడ్‌ రోజన్‌బర్గ్‌ తన పరిశోధనా పత్రంలో పేర్కొన్నారు. అయితే, ఇప్పటికిప్పుడే ఆ పరిస్థితి వచ్చేస్తుందని అనను కానీ, కొంత కాలం తరువాత అయినా జరిగేది ఇదేనని కచ్చితంగా చెప్పగలను అని రోజెన్‌బర్గ్‌ పేర్కొన్నారు.