9 రాష్ట్రాల్లో కొవిడ్ 2తో కలకలం

జన్యు మార్పుతో తలెత్తిన సరికొత్త కొవిడ్ తలెత్తిన బ్రిటన్ నుంచి ఇండియాకు వచ్చిన వారు 9 రాష్ట్రాలకు వెళ్లారు. ఈ రాష్ట్రాలలో తెలంగాణ, పంజాబ్, మహారాష్ట్రలు కూడా ఉన్నాయి. కొత్త వైరస్ నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ అప్రమత్తం అయింది. దీనిని ఆదిలోనే నివారించాలని చర్యలు చేపట్టింది. 

బ్రిటన్ నుంచి వచ్చిన వారి వివరాలను ఆరాతీస్తోంది. వీరిని గుర్తించి పరీక్షలు నిర్వహించి జన్యు పరిణామాన్ని శాంపుల్స్ ప్రక్రియలో నిర్థారించేందుకు చర్యలు చేపట్టారు. యుకె మ్యుటెంట్ స్ట్రెయిన్ ఇప్పటికైతే ఇండియాలో గుర్తించలేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. బ్రిటన్ నుంచి వచ్చే విమానాల రాకపోకలను నిలిపివేశారు.

మరో వైపు ఇప్పటికే బ్రిటన్ నుంచి భారత్‌కు వచ్చిన వారు ఏ రాష్ట్రాలకు వెళ్లినా వారిని కనుగొని వారి పరిస్థితిని సమీక్షించడం, వారికి తగు ఆరోగ్య చికిత్సలు చేపట్టేందుకు ప్రక్రియ మొదలైంది. తెలంగాణ, కేరళ, గుజరాత్, కర్నాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, గోవా, తమిళనాడు, కర్నాటక ఈ తొమ్మిది రాష్ట్రాలకు బ్రిటన్ నుంచి వచ్చిన వారు ఎక్కడెక్కడ ఉన్నారనేది తేల్చుకోవల్సి ఉంది. 

ఇటీవలి కాలంలో బ్రిటన్ నుంచి ఎవరు వచ్చినా వెంటనే వారి వివరాలు సేకరించి పెట్టుకుని, తమకు తెలియచేయాలని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ మార్గదర్శకాలు వెలువరించింది. ఎవరిలో అయిన కొత్త జన్యుమిశ్రిత వైరస్ ఉన్నట్లు నిర్థారణ అయితే వెంటనే ఈ శాంపుల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ లాబ్‌లకు హుటాహుటిన పంపించాలని సూచించారు.

కాగా, బ్రిటన్‌లో వ్యాప్తిచెందుతున్న రూపాంతరం చెందిన కరోనా వైరస్ పాత వైరస్‌కన్నా వేగంగా ఒకరినుంచి మరొకరికి సోకుతోందని, దీని కారణంగా కొత్త సంవత్సరంలో ఎక్కువ మంది ఆస్పత్రి పాలు కావడం, ప్రాణాలు కోల్పోవడం జరగవచ్చని తాజాగా జరిపిన అధ్యయనం వెల్లడించింది. 

రూపాంతరం చెందిన ఈ వైరస్ ఇతర స్ట్రెయిన్‌లకంటే 56 శాతం ఎక్కువగా ఒకరినుంచి మరొకరికి సోకే లక్షణాలు కలిగి ఉందని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్, అండ్ ట్రాపికల్ మెడిసిన్‌లోని సెంటర్ ఫర్ మ్యాథమాటికల్ మోడలింగ్ ఆఫ్ ఇన్‌ఫెక్షన్ డిసీజెస్ జరిపిన తాజా అధ్యయనంతో వెల్లడైంది. అయితే ఈ వైరస్ వల్ల ఎక్కువగా మరణాలు సంభవిస్తాయా లేదా తక్కువగా సంభవిస్తాయనే దానికి మాత్రం స్పష్టమైన సాక్షాధారాలు మాత్రం లేవు.