గాల్వన్ లోయలో  ‘గాల్వన్ కే బల్వాన్’

గాల్వన్ లోయలో చైనా సైన్యంతో భారత భద్రతా దళాలు ముఖాముఖి తలపడి అమరవీరులైన భారత జవాన్లకు నివాళిగా తోటను అభివృద్ధి చేస్తున్నారు. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) ఈ భారీ తోటల పెంపకాన్ని చేపట్టింది. ‘గాల్వన్ కే బల్వాన్’ పేరుతో ఈ ప్రాంతంలో 1,000 కి పైగా మొక్కలను నాటారు. 
 
-30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను ఎదుర్కొనే ఈ ప్రాంతంలో అమరవీరుల గౌరవార్థం తోట పెంచుతున్నారు. ఐటీబీపీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం  ఈ ప్రాంతం పూర్తిగా బంజరు భూమిలా ఉంటుంది. ఇక్కడ ఎలాంటి చెట్లు లేవు. -30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతకు తక్కువ కాకుండా ఉండే వాతావరణంలో జీవించగలిగే మొక్కలను ఇక్కడ పెంచేందుకు ఏర్పాట్లు చేశారు. 
 
ఐటీబీపీ, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, సాశస్త్రా సీమాబల్ వంటి కేంద్ర పోలీసు దళాల కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ప్లాంటేషన్ డ్రైవ్ చేపట్టారు. ఐటీబీపీ అమరవీరులకు అంకితం చేసేలా ఈ ఉద్యానవనాన్ని సృష్టిస్తున్నారు. 
 
ఈ డ్రైవ్ వచ్చే ఏడాది కూడా కొనసాగనున్నది. త్వరలోనే ఈ ప్రాంతమంతా పచ్చదనం పరుచుకునేలా చేయడమే ఈ డ్రైవ్‌ ఉద్దేశం. చైనా, భారత దళాలు తూర్పు లడఖ్‌లోని ఎల్‌ఏసీ వెంట మే ఆరంభం నుంచి స్టాండ్-ఆఫ్‌ విధుల్లో నిమగ్నమై ఉన్నాయి. 
 
గాల్వన్ లోయలో ఘర్షణ అనంతరం జూన్‌ నెలలో ఎల్ఏసీ వెంట పరిస్థితి క్షీణించడంతో ఇరుపక్షాలు ప్రాణనష్టానికి గురయ్యాయి. దాదాపు 20 మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. తూర్పు లడఖ్‌లో చైనా దళాలు ఏకపక్షంగా చొచ్చుకు రావడంతో.. యథాతథ స్థితిని మార్చడానికి చేసిన ప్రయత్నం ఫలితంగా ఘర్షణ చోటుచేసుకున్నది.