సిస్టర్ అభయ హత్య కేసులో దోషులకు జీవిత ఖైదు

కేరళలో సంచలనం సృష్టించిన సిస్టర్ అభయ హత్య కేసులో బుధవారం సీబీఐ ప్రత్యేక కోర్టు దోషులకు శిక్ష ఖరారు చేసింది. ఈ కేసులో నిందితులు ఫాదర్ థామస్ కొట్టూరు, నన్ సెఫీలకు జీవిత ఖైదు విధిస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. 

1992 మార్చి 27న సిస్టర్ అభయ అనుమానస్పద స్థితిలో మృతి చెందగా 28దేళ్ల తర్వాత దోషులకు శిక్ష పడింది. కొట్టాయంలోని బీసీఎం కాలేజీలో చదివే సిస్టర్ అభయ అక్కడే హాస్టల్‌లో ఉండేది. 1992 మార్చి 27వతేదీ తెల్లవారుజామున అభయ తన హాస్టల్ గది నుంచి కిచెన్‌లోకి వెళ్లగా అక్కడ ఫాదర్ థామస్ కొట్టూరు,

ఫాదర్ పూధ్రకయాల్, నన్ సెఫీ అభ్యంతరకర రీతిలో కనిపించారు. దీంతో తమ విషయం బయటపడుతుందని భయపడిన ఫాదర్ కొట్టూర్, నన్ సెఫీ అభయ తలపై కర్రతో బలంగా కొట్టారు. ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఆ తర్వాత నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు సిస్టర్ అభయ మృత దేహాన్ని బావిలో పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. ఈ కేసును తొలుత స్థానిక పోలీసులు, ఆ తర్వాత క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు జరిపి ఆత్మహత్యగా నిర్ధారించారు.

అయితే దీనిపై స్థానికంగా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మానవ హక్కుల కార్యకర్త జోమన్ పుతిన్ పురక్కల్ సహా పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో 1993లో కేసును సీబీఐకి అప్పగించారు. 2009లో సీబీఐ చార్జి షీటు దాఖలు చేసింది. సుదీర్ఘ విచారణ అనంతరం ఫాదర్ థామస్ కొట్టూరు, నన్ సెఫీలను దోషులుగా తేలుస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం తీర్పు వెలువరిస్తూ బుధవారం శిక్ష ఖరారు చేసింది. కాగా రెండేళ్ల క్రితం ఫాదర్ పూధ్రకయాల్‌కు వ్యతిరేకంగా సరైన సాక్ష్యాలు లేకపోవడంతో న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించింది.