దలైలామా వారసుడిని ఎంచుకునే హక్కు టిబెటన్లకే కల్పించే బిల్లుకు ఆమోదం తెలపడం ద్వారా అమెరికా కాంగ్రెస్ చైనా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడవేసింది. ద టిబెటన్ పాలసీ అండ్ సపోర్ట్ యాక్ట్ ఆఫ్ 2020 (టీపీఎస్ఏ)పై చైనా మండిపడుతోంది. తమ అంతర్గత వ్యవహారాల్లో తలదూరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తోంది.
ఈ తాజా చట్టం టిబెట్‌లోని ప్రధాన నగరమైన లాసాలో అమెరికా కాన్సులేట్ ఏర్పాటుతోపాటు తర్వాతి దలై లామాను ఎంచుకునే హక్కును టిబెటన్లకే కట్టబెడుతోంది. ఆ నిర్ణయం ప్రస్తుత దలైలామా, టిబెటన్ బౌద్ధ నాయకులూ, టిబెట్ ప్రజలదే అని టీపీఎస్ఏ స్పష్టం చేస్తోందని సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇప్పటికే ఈ బిల్లుకు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఆమోదం తెలిపింది. ఒక విధంగా ఈ బిల్లు చైనాలో టిబెట్ ప్రజల స్వయం ప్రతిపత్తిని చాటిచెప్పిన్నట్లు అయింది. ఒకవేళ ఈ వ్యవహారంలో చైనా ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకుంటే తీవ్రమైన ఆంక్షలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఆ ప్రకటనలో హెచ్చరించడం గమనార్హం.
ఈ వ్యవహారంతో కంగుతిన్న చైనా తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని అమెరికాను హెచ్చరించింది. దీనిపై సంతకం చేయకూడదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను చైనా విదేశాంగ శాఖ డిమాండ్ చేసింది. ఈ చట్టం టిబెట్ స్వాతంత్య్ర పోరాటానికి ఓ విజయమని సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ అధ్యక్షుడు లాబ్‌సాంగ్ సాంగాయ్ హర్షం ప్రకటించారు.
ఈ చట్టం కోసం తాము రెండేళ్లుగా డిమాండ్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. చైనా ఇప్పటికే తర్వాతి దలై లామాను నియమించే ప్రక్రియను మొదలుపెట్టిన నేపథ్యంలో అమెరికా ఈ చట్టాన్ని తీసుకురావడం ప్రాధాన్యత సంతరించుకుంది. తమ కీలుబొమ్మ వ్యక్తిని దలైలామా వారసునిగా ప్రకటించడం ద్వారా బౌద్ధ ప్రజలు ఎవ్వరు తిరుగుబాటు చేయకుండా కట్టడి చేయడం కోసం చైనా చాలాకాలంగా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నది.
More Stories
తుది దశకు చేరుకున్న వామపక్ష తీవ్రవాదం
ఇజ్రాయెల్- హమాస్ మధ్య పోరుకు ఏడాది పూర్తి
కెనడాలో వెయిటర్ ఉద్యోగాలకై వేల మంది భారతీయుల క్యూ