కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ పిట్టల దొర కబుర్లే

తెలంగాణ సర్కారు అస్తవ్యస్త పరిపాలనా తీరు దేశవ్యాప్తంగా చులకన చేసే స్థితికి దిగజారిపోయిందని బిజెపి నేత, మాజీ ఎంపీ విజయశాంతి విచారం వ్యక్తం చేసారు.  సీఎం కేసీఆర్ దొరగారు ఉద్యమకాలంలోను, ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు పిట్టలదొర కబుర్లే తప్ప చిత్తశుద్ధి ఏ మాత్రం లేదని తేలిపోయిందని విమర్శించారు.
 
కేసీఆర్ దొరవారి హామీతో సన్న వడ్లు పండించిన పాపానికి మద్దతు ధర సైతం దక్కని పరిస్థితుల్లో ఆ రైతులు తమ పంటను పక్క రాష్ట్రాలకు అమ్ముకుని బతకాల్సి వచ్చిందని విజయశాంతి మండిపడ్డారు. వీరికి తోడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొనుగోళ్ళు లేక మక్క రైతులు రోడ్డెక్కారని పేర్కొన్నారు. అన్నదాతలు తమ పంటలకు మంట పెట్టుకున్నారని తెలిపారు. 
 
 తమరిచ్చిన ఉద్యోగాల హామీని నమ్ముకున్న పలువురు అమాయక నిరుద్యోగులు బలవన్మరణాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. వివిధ ప్రాజెక్ట్‌ల నుంచి తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నీటి వాటా విషయంలో కూడా కేసీఆర్ సర్కారు విఫలమైందని దుయ్యబట్టారు. మొత్తంగా చూస్తే, అటు ఉద్యమ కాలంతో పాటు పాలనా పగ్గాలు అందుకున్న నాటి నుంచి కేసీఆర్ చెబుతూ వచ్చిన మా నీళ్ళు మాకు… మా ఉద్యోగాలు మాకు” అనే నినాదం ఆయన అధికారానికి వచ్చినా సాకారం కాని దారుణ పరిస్థితిలో రాష్ట్రం ఉందని బీజేపీ నేత వ్యాఖ్యానించారు.
 
ఇక భూసంస్కరణలంటూ కేసీఆర్ సర్కారు ప్రారంభించిన ధరణి వెబ్ సైటు చుక్కలు చూపిస్తోందని ఎద్దేవా చేశారు. ఇవిగాక డబుల్ బెడ్రూములు, దళితులకు మూడెకరాలు, తాజాగా వరదసాయం, తమ నేతల కబ్జాలు, అవినీతి… ఇలా చెప్పుకుంటూ పోతే టీఆర్‌ఎస్ వైఫల్యాల వరుసక్రమానికి ఆకాశమే హద్దుగా మారిందని చెప్పుకొచ్చారు.
 
తమరిచ్చే హామీలన్నీ ఓట్ల కోసం వేసే గాలాలేనని ప్రజలు బాగా అర్థం చేసుకున్నారని చెప్పారు. ప్రజల మధ్యకు వెళ్ళినప్పుడల్లా దుబ్బాక, జీహెచ్ఎంసీలను గుర్తు చేస్తూనే ఉంటారని విజయశాంతి విమర్శలు గుప్పించారు.