వాయు కాలుష్యంతో 17 లక్షల మంది మృత్యువాత    

వాయు కాలుష్యం వల్ల 2019 సంవత్సరంలో 17 లక్షల మంది భారత్ దేశ ప్రజలు మృత్యువాతపడ్డారని ఇంటర్‌ డిసిప్లినరీ జర్నల్‌ లాన్సెట్‌ ప్లానెటరీ హెల్త్‌ నివేదిక తెలిపింది. నివాసాల్లో, బహిరంగ ప్రదేశాల్లో ఏర్పడే వాయు కాలుష్యం కారణంగా ఏర్పడే ఆరోగ్యం, ఆర్థిక ప్రభావాలను ఇండియా స్టేట్‌ లెవల్‌ డిసీజ్‌ బర్డెన్‌ ఇనిషియేటివ్‌ సర్వే చేసింది.
 
దేశవ్యాప్తంగా నమోదైన మరణాల్లో 18 శాతం వాయు కాలుష్యంతోనే ఉన్నట్లు ఈ ఏడాది డిసెంబర్‌ 21న విడుదల చేసిన నివేదికలో తెలిపింది. అయితే గృహాల్లో ఉండే వాయు కాలుష్యం వల్ల గత రెండు దశాబ్దాలలో (1990-2019) 64 శాతం తక్కువ మరణాలకు కారణమైందని తెలిపింది. బహిరంగ వాయు కాలుష్యం అధికంగా పెరగడంతో పాటు ఎక్కువ మంది మరణిస్తున్నారు.
 
 ‘బహిరంగ వాయు కాలుష్యంతో మరణాల రేటు ఈ కాలంలో 115 శాతం పెరిగిందని ఈ అధ్యయనం పేర్కొంది. ఈ వాయు కాలుష్యం వల్ల ప్రజారోగ్యానికి తీవ్రమైన ముప్పును కలిగిస్తుందని, స్థానిక, జాతీయ స్థాయిలో ప్రభుత్వాలు నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడం చాలా అవసరం’ అని వాషింగ్టన్‌ యూనివర్శిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ హెల్త్‌ మెట్రిక్స్‌ అండ్‌ ఎవాల్యుయేషన్‌ డైరెక్టర్‌ క్రిస్టోషర్‌ ముర్రే పేర్కొన్నారు. 
 
వాయు కాలుష్యం వల్ల అనారోగ్యం, అకాల మరణాలతో జిడిపి వృద్ధిరేటు 1.4 శాతం పడిపోయిందని అన్నారు. ఇది ఆర్థికంగా చూస్తే.. 2,60,000 కోట్లకు సమానం అంటే 2020-21 కేంద్ర బడ్జెట్‌ల్‌ ఆరోగ్య సంరక్షణ కోసం కేటాయించిన దానికంటే నాలుగు రెట్లు ఎక్కువ.