భారత వాయుసేన మరింత  శక్తిమంతం 

ఇంటలిజెన్స్, టెక్నాలజీ  సాయంతో.. భారత వాయుసేన మరింత  శక్తిమంతం అయ్యిందని ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కొనియాడారు. బాలాకోట్  దాడులతో భారత  ఎయిర్ ఫోర్స్  సత్తా ప్రపంచానికి  తెలిసిందని పేర్కొన్నారు. హైదరాబాద్ లోని దుండిగ‌ల్ ఎయిర్‌ఫోర్స్ అకాడ‌మీలో ఇవాళ జరిగిన పాసింగ్ ఔట్ ప‌రేడ్ లో పాల్గొంటూ   స్వంత దేశానికి సెంట్రీలుగా ప‌నిచేయ‌డం అదృష్ట‌మ‌ని, మీరంతా మీ విధుల‌కు న్యాయం చేస్తారని భావిస్తున్న‌ట్లు మంత్రి రాజ్‌నాథ్ తెలిపారు.
 
భార‌త వైమానిక ద‌ళానికి వైభ‌వోపేత‌మైన చ‌రిత్ర ఉన్న‌ద‌ని చెబుతూ అనేక సంద‌ర్భాల్లో మన వైమానికదళం త‌న విరోచిత స‌త్తాను చాటింద‌ని కొనియాడారు.  1971లో జ‌రిగిన లాంగేవాలా యుద్ధం నుంచి ఇటీవ‌ల జ‌రిగిన బాలాకోట్ దాడుల వ‌ర‌కు వైమానిక ద‌ళం అనన్య‌మైన ధైర్య‌సాహాసాల‌ను ప్ర‌ద‌ర్శించిన‌ట్లు రక్షణ మంత్రి ప్రశంసించారు.  
 
మ‌న దేశ చ‌రిత్ర‌లోఆ సంఘ‌ట‌న‌ల‌న్నీ సువ‌ర్ణాధ్యాయంగా లిఖించబ‌డుతాయ‌ని ఆయ‌న చెప్పారు. రఫెల్ యుద్ధ విమానాలు మన వైమానిక డలంకు మరింత బలం ఇచ్చిందని చెబుతూ దేశ రక్షణ త్రివిధ దళాలపై ఉందన్న ఆయన..నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 
 
శ్రీలంక-వియత్నం-నైజిరియా దేశాలకు చెందిన వారికి సైతం భారత్ లో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు.  శత్రువులను ఎలాంటి పరిస్థితి లోనైనా ఎదుర్కోగలమని ఇప్పటికే నిరూపించామని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న  పాకిస్థాన్ పై  నాలుగుసార్లు  విజయం సాధించామన్నారు రక్షణ మంత్రి గుర్తు చేశారు.