
పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చిన సమయంలో విధించిన షరతులకు లోబడి పునరావాస ప్యాకేజీ సక్రమంగా పూర్తయిన తర్వాతే డ్యామ్ నిర్మాణం పనులను నిర్వహించాలని రాష్ట్ర ఎస్ సీ, ఎస్ టీ హక్కుల సంక్షేమ వేదికరాష్ట్ర కమిటి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
రెండు లక్షలమంది గిరిజనులు, దళితుల పునరావాస ప్యాకేజీ నీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం పట్ల అక్కడి ప్రజల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయని వేదిక పేర్కొన్నది. మొదటి దశలో 8 గ్రామాలను ఖాళీ చేయించగా వారి పునరావాసం లో ఎన్నో అవకతవకలు వెలుగు చూశాయని తెలిపింది.
అంతంత మాత్రంగా అమలు జరుగుతున్న పునరావాస ప్యాకేజీ లో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని, గిరిజనుల స్థానంలో గిరిజనేతరులు లబ్ధి పొందుతున్నారని, ఇందుకు అవినీతి అధికారులు సహకరిస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేసింది.
పోలవరం నిర్వాసిత గ్రామాల పర్యటన అనంతరం సోమవారం జరిగిన పోలవరం నిర్వాసితుల రౌండ్ టేబుల్ సమావేశంలో గిరిజనులు తమ గోడును వ్యక్తం చేశారు. వేదిక రాష్ట్ర అధ్యక్షులు దూలం బూసి రాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నిర్వాసితులు పలువురు పాల్గొన్నారు.
గిరిజనుల సంక్షేమానికి ఉద్దేశించిన పిసా చట్టం ప్రకారం గ్రామ సభలను నిర్వహించిన తర్వాతే అక్కడి తీర్మాణాల మేరకే పునరావాస ప్యాకేజీ ని అమలు జరపాలని సమావేశం తీర్మానించింది. నిర్వాసితుల సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు జాతీయ ఎస్ టీ కమిటీ మరోమారు పోలవరం ప్రాంతాల్లో పర్యటించాలని డిమాండ్ చేసింది.
పాలకులు, అధికారులు చెప్పినదానికి భిన్నంగా 35 మీటర్ల ఎత్తులోని కాపర్ డ్యాం నిర్మాణం వల్ల పెద్ద ఎత్తున 137 గ్రామాలు తాజా గోదావరి వరదల్లో జలమయం అయినందున కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ తిరిగి పోలవరం కాంటూర్లను సమీక్షించాలని సమావేశం విజ్ఞప్తి చేసింది.
పాక్షిక ముంపు గ్రామాలను కూడా పూర్తి ముంపు గ్రామాల గా ప్రకటించాలని, అటవీ హక్కుల చట్టాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేసింది.
తాజా గోదావరి వరదల వల్ల, డ్యాం నిర్మాణం పూర్తి కాక పోయినా ముంపు పరిధిలో లేని గ్రామాల్లోకి గోదావరి వరద నీరు రావడం పట్ల పునరావాస చర్యలు పరిశీలించే కేంద్ర సలహా సమితి దీన్ని తీవ్ర అంశంగా ఆలోచించి నివారణ చర్యలు చేపట్టా లని సమావేశం కోరింది .
శక్తి స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు డా.పిరాట్ల శివరామకృష్ణ, పోలవరం నిర్వాసితుల సంక్షేమ సమితి అధ్యక్షులు సుబ్బరాయ శాస్త్రి, సామాజిక సమరసత జాతీయ కన్వీనర్ శ్యాం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
More Stories
హత్యకు ముందు భారత్ పై దాడులకు నిజ్జర్ భారీ కుట్రలు
ఎసిబి న్యాయమూర్తిపై ట్రోలింగ్ …విచారణకు ఆదేశించిన రాష్ట్రపతి
నేడు ఏపీ సిఐడి కస్టడీకి చంద్రబాబు నాయుడు