అడ్డగోలు దురాక్రమణలకు తెగబడుతున్న చైనాపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పరోక్ష విమర్శలు చేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఒప్పందాలు ఏ విధమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయో అర్థం చేసుకోవడానికి ఇలాంటి ఘటనలే తార్కాణాలని పేర్కొన్నారు.
‘మన హిమాలయన్ ఫ్రాంటియర్స్‌లో ఎలాంటి హెచ్చరికలు లేకుండా దురాక్రమణలకు తెగబడుతుండటం చూస్తే ప్రపంచం ఏవిధంగా మార్పులకు గురవుతున్నదో, అమలులో ఉన్న ఒప్పందాలు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటున్నాయో అవగతమవుతున్నది’ అంటూ మండిపడ్డారు.
ఇది హిమాలయాలకే పరిమితం కాదని, ఇండో-పసిఫిక్ విషయంలోనూ ఇలాంటివి చోటుచేసుకుంటున్నాయని విమర్శించారు. ఫిక్కీ వార్షిక సదస్సులో రాజ్‌నాథ్ మట్లాడుతూ భారత సైనికులు ప్రదర్శిస్తున్న ధైర్యసాహసాలను కొనియాడారు. ‘లడఖ్‌లోని ఎల్ఏసీ వద్ద మన బలగాలు అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శిస్తున్నాయి. ఎంతో శౌర్యపరాక్రమాలు చూపించి పీఎల్ఏతో (చైనా బలగాలు) తలపడుతూ వారిని వెనక్కి నెడుతున్నాయి’ అని రాజ్‌నాథ్ ప్రశంసించారు.
ఉగ్రవాదానికి పెద్దన్న పాకిస్థాన్ అని రాజ్‌నాథ్ మండిపడ్డారు. మనం సరిహద్దు ఉగ్రవాద బాధితులమని, ఎవరి మద్దతు లేనప్పడు కూడా ఒంటరిగా ఉగ్రవాదంపై పోరు సాగిస్తూ వచ్చామని చెప్పారు. అనంతర కాలంలో ఉగ్రవాద పెద్దన్నతో మనం పోరాడుతున్న విషయాన్ని ప్రపంచమంతా గ్రహించిందని పేర్కొన్నారు.
కాగా, రైతుల ఆందోళనపై మాట్లాడుతూ, కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకునే తీసుకొచ్చామని స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి వల్ల వచ్చే ప్రతికూల అంశాలను వ్యవసాయ రంగం నివారించగలిగిందని, కరోనా సమయంలోనూ తట్టుకొని నిలబడిందని రాజ్‌నాథ్ చెప్పారు.
రైతాంగం తిరోగమన దిశకు వెళ్లే ఏ చర్యనూ తమ సర్కార్ తీసుకోదని భరోసా ఇచచ్చారు. రైతులతో చర్చలు జరిపేందుకు, వారి మనోభావాలను తెలుసుకునేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు.
More Stories
న్యూయార్క్‌లోని స్వామినారాయణ దేవాలయం ధ్వంసం
ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ కు చేరిన భారత్
చైనాలో బెబింకా టైఫూన్ బీభత్సం