ఈపీఎఫ్‌ఓ ఖాతాల్లో ఒకేసారి వడ్డీ జమ!  

తమ ఖాతాదారులకు ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఈపీఎఫ్‌ఓ) శుభవార్త అందించబోతున్నది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 8.5 శాతం వడ్డీని ఈ నెలాఖారులోగా ఒకేసారి వినియోగదారుల ఖాతాల్లో జమచేయనుంది.  
 
ఇదివరకు ఈ వడ్డీని రెండు వాయిదాల్లో జమ చేస్తారన్న వార్తలొచ్చాయి. అంటే 8.15 శాతం ఒకసారి, మిగతా 0.35 శాతం మరో విడతలో ఖాతాదారుల అకౌంట్‌లో జమ చేయాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సెప్టెంబర్ 9న నిర్ణయం తీసుకుంది. 
 
కానీ ప్రస్తుత పరిణామాలను బట్టి రెండు విడతల్లో కాకుండా ఒకేసారి వడ్డీ జమ చేయాలని ఈపీఎఫ్ఓ భావిస్తోంది. త్వరలోనే ఖాతాదారుల అకౌంట్లలో వడ్డీ జమ కానుంది. 
 
ఈపీఎఫ్ఓ ఈక్విటీ మార్కెట్లలో పెట్టిన పెట్టుబడులకు అప్పట్లో రిటర్న్స్ ఆశించినట్టుగా రాలేదు. అందుకే రెండు విడతల్లో వడ్డీ జమ చేయాలన్న ప్రతిపాదనలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఈక్విటీ పెట్టుబడుల నుంచి అంచనాల కన్నా ఎక్కువ రిటర్న్స్ వచ్చాయి. 
 
ఈపీఎఫ్ఓకు వచ్చిన రిటర్న్స్‌లో ఫిక్స్‌డ్ పెట్టుబడి మార్గాల ద్వారా 85 శాతం, ఈటీఎఫ్‌ల ద్వారా 15 శాతం రిటర్న్స్ వచ్చాయి. దీంతో ఈపీఎఫ్ ఖాతాదారులకు ఒకేసారి వడ్డీ జమ చేయాలని ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకోనుంది. ఖాతాదారుల అకౌంట్లలో వడ్డీ జమ చేసిన తర్వాత కూడా ఈపీఎఫ్ఓ దగ్గర మిగులు ఉండనుంది.