రిప‌బ్లిక్ టీవీ సీఈవో అరెస్ట్‌  

టెలివిజ‌న్ రేటింగ్ పాయింట్స్ (టీఆర్‌పీ)ను తారుమారు చేసిన కేసులో రిప‌బ్లిక్ టీవీ సీఈవో వికాస్ ఖాంచందానిని ఆదివారం అరెస్ట్ చేశారు ముంబై పోలీసులు. జాయింట్ క‌మిష‌న‌ర్ ఆఫ్ పోలీస్ మిలింద్ భారంభే ఆయ‌న అరెస్ట్‌ను ధృవీక‌రించారు.

వికాస్‌ను ఆదివార‌మే కోర్టు ముందు ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. అరెస్ట్‌కు ముందు ద‌ర్యాప్తులో భాగంగా వికాస్‌ను రెండుసార్లు ప్ర‌శ్నించారు. ల్యాండింగ్ చానెల్ నంబ‌ర్ (ఎల్‌సీఎన్‌) టెక్నాల‌జీ ద్వారా కేబుల్ ఆప‌రేటర్లు టీఆర్పీల‌ను తారుమారు చేసిన‌ట్లు క్రైమ్ బ్రాంచ్ విచార‌ణ‌లో తేలింది.

ఈ ఎల్‌సీఎన్‌ను ఫిక్స్ చేసి, ప్రమోట్ చేయాల‌ని రిప‌బ్లిక్ టీవీ.. కేబుల్ ఆప‌రేట‌ర్ల‌ను కోరిన‌ట్లు కూడా పోలీసులు ఆధారాలు సేక‌రించారు. దీనికోసం ఏర్పాటు చేసిన‌ వాట్సాప్ గ్రూప్‌లో సీఈవో వికాస్ కూడా ఉన్న‌ట్లు విచార‌ణ‌లో తేలింది.

గ‌త అక్టోబ‌ర్ నెల‌లో ఈ న‌కిలీ టీఆర్పీ స్కామ్ వెలుగులోకి వ‌చ్చింది. కొన్నీ  టీవీ చానెళ్లు రేటింగ్స్‌ను తారుమారు చేస్తున్నాయంటూ రేటింగ్స్ ఏజెన్సీ బ్రాడ్‌కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్‌) ఫిర్యాదు చేసింది. టీవీ చానెళ్ల‌కు వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లు రావ‌డంతో ఈ టీఆర్పీలే కీల‌కం. దీంతో న‌కిలీ రేటింగ్స్‌ను సృష్టించి ప్ర‌క‌ట‌న‌ల‌ను ఆక‌ర్షించ‌డానికి కొన్ని టీవీ చానెళ్లు ఇలా న‌కిలీ టీఆర్పీ స్కామ్‌కు తెర‌తీశాయి.

రేటింగ్ మీట‌ర్లు ఉన్న ఇళ్ల‌లో ఉన్న వాళ్ల‌కు లంచాలు ఇచ్చి.. త‌మ చానెలే చూసే విధంగా రిప‌బ్లిక్ టీవీ ప్రోత్స‌హించింద‌ని పోలీసులు త‌మ విచార‌ణ‌లో తేల్చారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ కేసుకు సంబంధించి స్పెష‌ల్ ఇన్వెస్టిగేష‌న్ టీమ్ 13 మందిని అరెస్ట్ చేశారు.