సుప్రీం కోర్ట్ లో ట్రంప్ కు చుక్కెదురు 

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ప్రకటించకుండా అడ్డుకోవాలనుకున్న అధ్యక్షుడు ట్రంప్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. నాలుగు కీలకరాష్ట్రాలల్లో ఓటింగ్‌ ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని, అక్కడి ఎన్నికల ఫలితాలను నిలిపివేయాలని టెక్సాస్‌కు చెందిన రిపబ్లికన్లు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. 
 
రిపబ్లికన్ల ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని పేర్కొన్నది. దానితో ఎన్నికల ఫలితాలను అడ్డుకోవడానికి ట్రంప్ కు గల న్యాయమార్గాలన్నీ ముసుకు పోయిన్నట్లయింది.  రిపబ్లికన్ల పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చడం ఈ వారంలో ఇది రెండోసారి. ఎన్నికల ఫలితాల నిలుపుదలకు చివరిప్రయత్నం విఫలమైంది. 
 
అధ్యక్ష ఎన్నికల ఫలితాలను సోమవారం అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలుస్తున్నది. తర్వాత ఎలక్టోరల్‌ కాలేజీ సమావేశమై అమెరికా అధ్యక్షుడిని ఎన్నుకొంటుంది. 538 మంది సభ్యులున్న ఎలక్టోరల్‌ కాలేజీలో జో బైడెన్‌ 306, ట్రంప్‌ 232 ఓట్లు గెలుచుకున్నారు.
 
జార్జియా, మిషిగన్, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో మోసం జరిగిందని, ఆ రాష్ట్రాల్లో ఎన్నికలను రద్దు చేయాలంటూ ట్రంప్​తో పాటు టెక్సాస్ తదితర రాష్ట్రాల అటార్నీలు వేసిన లా సూట్​ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టేసింది.
 
 ‘‘ఈ కేసును విచారించాలని కోర్టు భావించింది. కానీ ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలపై టెక్సస్ ఇలా జోక్యం చేసుకోవడం న్యాయపరంగా సరైనదిగా కన్పించడం లేదు. ఈ విషయంలో పెండింగ్ లో ఉన్న అన్ని పిటిషన్లను డిస్మిస్ చేస్తున్నాం” అని  సుప్రీంకోర్టు జస్టిస్​లు శామ్యూల్ అలిటో, క్లారెన్స్ థామస్ స్పష్టం చేశారు. 
 
కాగా, సుప్రీంకోర్టు తీర్పుపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేశారు. ‘‘సుప్రీంకోర్టు మమ్మల్ని నిజంగా కూలదోసింది. వివేకం లేదు. ధైర్యం లేదు. కోర్టు తీర్పు అవమానకరం. ఇది మొత్తం అమెరికాకే ఆందోళనకరమైన విషయం” అని ట్రంప్ పేర్కొన్నారు.