భారత్ కు సవాళ్ళను దీటుగా ఎదుర్కొనే సత్తా 

 సవాళ్ళను దీటుగా ఎదుర్కొనే సత్తా భారత దేశానికి ఉందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ భరోసా వ్యక్తం చేశారు. ఇది మన దేశానికి పరీక్షా కాలమని చెప్తూ, దేశ భద్రతకు ఎదురవుతున్న సవాళ్ళను దీటుగా ఎదుర్కొంటామనే నమ్మకం తనకు ఉందని ధీమా వ్యక్తం చేశారు. 

ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) వార్షిక సాధారణ సమావేశంలో మాట్లాడుతూ ‘‘మనం పరీక్షకు గురవుతున్నాం. సందర్భానికి తగినట్లుగా నిలిచి, దేశ భద్రత సవాళ్ళను ఎదుర్కొనగలమనే గట్టి నమ్మకం నాకుంది. ప్రస్తుతానికి ఇంత కన్నా ఎక్కువగా నా అభిప్రాయాలను బయటపెట్టను’’ అని జైశంకర్ చెప్పారు.

వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి జరుగుతున్న పరిణామాలు ఆందోళనకరంగా ఉన్నాయన్నారు. కొన్ని అత్యంత మౌలికాంశాలు ఆందోళనను రేకెత్తిస్తున్నాయని పేర్కొన్నారు. తూర్పు లడఖ్‌లో జరిగినది వాస్తవానికి చైనా ప్రయోజనాలకు అనుకూలమైనది కాదని చెప్పారు. భారత దేశంలో ప్రజల మనోభావాలపై దీని ప్రభావం చెప్పుకోదగిన రీతిలో పడిందని తెలిపారు.

గత కొన్ని దశాబ్దాల్లో భారత్-చైనా మధ్య సంబంధాలను ప్రస్తావిస్తూ, చైనా గురించి భారతీయుల అభిప్రాయాల పరిణామాన్ని తాను ప్రొఫెషనల్‌గా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఇరు దేశాల సంబంధాలకు సంబంధించి ముఖ్యంగా తన బాల్యం, యవ్వనంనాటి చాలా సంక్లిష్టమైన కాలాన్ని గుర్తు చేసుకుంటున్నట్లు తెలిపారు. 

భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. అత్యంత జాగ్రత్తగా అభివృద్ధిపరచిన గుడ్‌విల్ క్రమంగా క్షీణిస్తుండటం వాస్తవానికి నిజమైన అపాయమని తెలిపారు.