ఇరాన్ లో మాజీ ప్ర‌తిప‌క్ష నేత జామ్‌ ఉరితీత

ఇరాన్ లో మాజీ ప్ర‌తిప‌క్ష నేత జామ్‌ ఉరితీత
ఇరాన్ లో మాజీ ప్ర‌తిప‌క్ష నేత రుహోల్లా జామ్‌ను ఉరితీశారు. చాలా కాలంగా ఆయన ఫ్రాన్స్‌లో త‌ల‌దాచుకుంటున్నారు. ఈ క్రమంలో అతడిని ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఆందోళనల కేసులో అరెస్టు చేశారు. 
 
ఇస్లామిక్ రిప‌బ్లిక్ దేశం ప‌ట్ల జామ్ అనేక నేరాల‌కు పాల్ప‌డిన‌ట్లు ఆ దేశ సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. రుహోల్లా జామ్ పై వచ్చిన ఆరోపణలు రుజువు కావడంతో ఇరాన్ ప్రభుత్వం శనివారం ఉదయం అతడిని ఉరితీసింది. 
 
రుహోల్లా జామ్ ను ఉరితీసినట్టు ఆ దేశ మీడియా వెల్లడించింది. గత అక్టోబర్ లో రుహోల్లా జామ్ ను  ఇరాన్ రెవ‌ల్యూష‌న‌రీ సైనిక ద‌ళాలు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. జామ్ అనేక ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకు కుట్ర చేశారని ఇరాన్ ప్రభుత్వం తెలిపింది. 
 
అంతేకాదు అవినీతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జామ్ కు గత జూన్ లో ఉరిశిక్ష ఖరారు చేస్తూ ఇరాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇరాన్ లో 2017 డిసెంబ‌ర్ నుంచి 2018 జ‌న‌వ‌రి వ‌ర‌కు జ‌రిగిన అల్ల‌ర్ల‌లో 25 మంది మృతిచెందారు.  
 
ఈ అల్లర్లకు జామ్ ప్రధాన కారకుడిగా ఇరాన్ వెల్లడించింది.  టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్ అమ‌ద్‌ న్యూస్ ద్వారా జామ్ ప్ర‌జ‌ల్ని రెచ్చగొట్టి ప్రభుత్వానికి వ్యతిరేక ఆందోళనలకు ప్రేరేపించినట్టు ఇరాన్ ప్రభుత్వం తేల్చి చెప్పింది.