బాలాకోట్‌లో మ‌ళ్లీ ఉగ్ర‌వాదుల శిక్ష‌ణ  

గ‌త ఏడాది ఫిబ్రవరి 26న పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో ఉన్న ఉగ్ర‌స్థావ‌రాల‌పై భార‌త బ‌ల‌గాలు మెరుపు దాడులు జరిపి, వాటిని ధ్వంసం చేయడం తెలిసిందే. అయితే మ‌ళ్లీ ఆ స్థావ‌రాల్లో ఉగ్ర‌వాదులు శిక్ష‌ణ పొందుతున్న‌ట్లు ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.  జేషే-ఈ-మ‌హ‌మ్మ‌ద్ ఉగ్ర సంస్థ ఆ క్యాంపుల్లో ఉగ్ర‌వాదుల‌కు శిక్ష‌ణ ఇస్తున్న‌ట్లు అనుమానిస్తున్నారు.

భార‌త భూభాగంపై దాడుల‌కు పాల్ప‌డేందుకు బృందాల‌ను త‌యారు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.  దీనికి సంబంధించిన ఓ వీడియో ఒక‌టి రిలీజైంది.  శిక్ష‌ణ పొందుతున్న ఉగ్ర‌వాదులు భార‌త్‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేస్తున్న‌ట్లు ఆ వీడియోలో ఉన్న‌ది.  ఆ శిక్ష‌ణ క్యాంపులో ఉగ్ర‌వాది మ‌సూద్ అజ‌హ‌ర్ సోద‌రుడు మౌలానా అబ్దుల్ రౌఫ్ అజ‌హ‌ర్ ఉన్న‌ట్లు నిఘా వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది.

మరోవంక,  గ‌త కొన్ని వారాల నుంచి నియంత్ర‌ణ రేఖ వ‌ద్ద పాకిస్థాన్ ద‌ళాలు కాల్పుల విర‌మ‌ణ ఒప్పందానికి పాల్ప‌డుతున్నాయి.   నియంత్రణ రేఖ వ‌ద్ద పాక్ చేస్తున్న కాల్పుల వ‌ల్ల భార‌త్ వైపు స్థానిక గ్రామ‌స్థులు ఇబ్బందులుప‌డుతున్నారు.