ఏపీలో ఆర్ధిక అత్యవసర పరిస్థితి ఉందా!

ఏపీలో ఆర్ధిక అత్యవసర పరిస్థితి ఉందా!
ఆంధ్ర ప్రదేశ్ లో ఆర్ధిక అత్యవసర పరిస్థితి నెలకొందా? ఈ సందేశం రాష్ట్ర హైకోర్టుకు కలిగింది. ‘ప్రభుత్వ ఆస్తులు అమ్మి నిధులు సమకూర్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందా? అంటూ ఆస్తులు విక్రయిస్తున్నారంటే ప్రభుత్వం వద్ద నిధులు లేవని అర్థమవుతోందని పేర్కొన్నది. 
 
పైగా,  ‘నవరత్నాల’ అమలు కోసం తుఫాను ఆశ్రయ కేంద్రాన్ని (సైక్లోన్‌ షెల్టర్‌) కూడా విక్రయిస్తారా? అని నిలదీసింది. ‘మిషన్‌ బిల్డ్‌ ఏపీ’ పథకంలో భాగంగా  వివిధ ప్రాంతాల్లోని ప్రభుత్వ స్థలాలను వేలం వేసే ప్రక్రియను సవాల్‌ చేస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు 
 
రాష్ట్రప్రభుత్వం విక్రయించదలచిన భూముల్లో గతంలో దాతలు ఇచ్చినవి ఉన్నాయని, నిబంధనల మేరకు వాటిని విక్రయించడానికి వీల్లేదని పిటిషనర్లు పేర్కొన్నారు. జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌, జస్టిస్‌ డి.రమేశ్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం దీనిపై విచారణ జరిపింది.
పిటిషనర్ల తరఫు న్యాయవాదుల్లో ఒకరు వాదనలు వినిపిస్తూ  ప్రభుత్వ నిర్వహణకు అవసరమైన నిధులు సమకూర్చుకునేందుకు మత్స్యకారుల కోసం విశాఖ ప్రాంతంలో నిర్మించిన సైక్లోన్‌ షెల్టర్‌ను కూడా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.
దీనిపై ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తంచేసింది. పిటిషనర్లలో ఒకరి తరఫున న్యాయవాది నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపిస్తూ.. ‘‘నవరత్నాలు, నాడు-నేడు పథకాల అమలు కోసం  ప్రభుత్వ ఆస్తులు విక్రయిస్తున్నారు. గుంటూరులోని ప్రసిద్ధ మార్కెట్‌, జైలు, విశాఖలో పోలీస్‌ శాఖకు చెందిన భూమిని విక్రయించనున్నారు” అంటూ తెలిపారు.
టెండర్లను ఖరారు చేయరాదని గతంలో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులతో ఆ ప్రక్రియ నిలిచిపోయిందని పేర్కొన్నారు. వీటితోపాటు ఇతర ఆస్తులను కూడా విక్రయించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేపట్టిందని చెప్పారు. ఈ పిటిషన్లలో పలు అంశాలు ఉన్నందున ప్రత్యక్ష విచారణ చేపట్టాలని అభ్యర్థించారు. అయితే,  ఆ అవసరం లేదంటూ ధర్మాసనం పేర్కొంది.

న్యాయవాది డీఎ్‌సఎన్‌వీ ప్రసాద్‌బాబు వాదనలు వినిపిస్తూ ‘‘నవరత్నాలలో మద్య నిషేధం కూడా ఉంది. కానీ, అదే నవరత్నాల అమలు కోసం నిరంతరాయంగా మద్యం విక్రయాలు చేపట్టారు. ప్రభుత్వ ఆస్తులూ విక్రయిస్తున్నారు’’ అని తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ. ‘‘కరోనా కాలంలో, అత్యధిక ధరలున్నా సరే… మద్యం కొనుగోలు చేసి రాష్ట్ర ప్రయోజనాల కోసం సహకరించిన మందుబాబులను కచ్చితంగా అభినందించాల్సిందే” అంటూ ఎద్దేవా చేసింది.

ప్రభుత్వ న్యాయవాది ఖాదర్‌ వాదనలు వినిపిస్తూ దేశం మొత్తమ్మీద ఏ రాష్ట్రం చేయలేనన్ని సంక్షేమ పథకాలను ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. ‘మీరెంత బాగా చేస్తున్నారో అందరికీ తెలుసు’ అని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది.

ప్రభుత్వ ఆస్తుల విక్రయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషనర్ల తరఫు న్యాయవాదులందరికీ వెంటనే కౌంటర్‌ ప్రతులు అందజేయాలని, లేనిపక్షంలో కౌంటర్‌ దాఖలుకు ప్రభుత్వానికి ఆసక్తి లేదని భావించి ముందుకెళ్తామని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది.