హైదరాబాద్ నుండి నేరుగా అమెరికాకు విమానం 

వచ్చే జనవరి నుండి, హైదరాబాద్ నుంచి అమెరికాకు నేరుగా విమాన సదుపాయం సమకూరనున్నది.  హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అమెరికాలోని చికాగోకు నేరుగా విమానాన్ని భారత ప్రభుత్వ విమాన సంస్థ ఎయిర్ ఇండియా జనవరి 15 నుండి నడపనుంది.
 
బోయింగ్ 777-200 విమానాలతో నడిచే ఈ సర్వీసులో సీట్ల సామర్థ్యం 238 (8 ఫస్ట్ క్లాస్ + 35 బిజినెస్ క్లాస్ + 195 ఎకానమీ క్లాస్). హైదరాబాద్-అమెరికా-హైదరాబాద్ మధ్య ఏటా 7 లక్షల మందిమంది ప్రయాణికులు ప్రయాణించడానికి ఆస్కారమున్నా దానికి తగిన అవకాశాలు లేవు.
హైదరాబాద్ దక్షిణ, మధ్య భారతదేశానికి ప్రవేశ ద్వారంలాంటిది. ఇది సమీప నగరాల నుండి వచ్చే ప్రయాణీకులకు అనుకూలంగా కూడా ఉంటుంది. విజయవాడ, విశాఖపట్నం, నాగ్‌పూర్, భువనేశ్వర్, రాజమండ్రి, భోపాల్, తిరుపతిలాంటి నగరాల నుంచి అమెరికాకు యేటా దాదాపు 2,20,000 మంది ప్రయాణికుల డిమాండ్ ఉంది.  
 
అమెరికాలోని చికాగోను హైదరాబాద్‌ తో కలుపుతూ విమాన సదుపాయం కల్పించాలని చాలాకాలంగా డిమాండ్ ఉన్నట్లు జిఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సిఇఓ ప్రదీప్ పణికర్ తెలిపారు.  ప్రమాణాల భద్రతపై దృష్టి సారించి, ప్రయాణీకులకు సేవ చేయడానికి, మరిన్ని దేశీయ, అంతర్జాతీయ నగరాలను కనెక్ట్ చేయడానికి తాము నిరంతరం కృషి చేస్తుంటామని ఆయన పేర్కొన్నారు.
అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఆపిల్, గూగుల్ వంటి అమెరికా దిగ్గజ కంపెనీలు ఎన్నో హైదరాబాద్‌లో ఉన్నాయి. హైదరాబాద్ నుండి ఐటి ఎగుమతులకు అమెరికా మొదటి గమ్యస్థానం. హైదరాబాద్ నుండి మొత్తం ఐటి ఎగుమతుల్లో దాదాపు 70 శాతం అమెరికాకే జరుగుతున్నాయి.  
 
ఇప్పుడు ఎయిర్ ఇండియా నుంచి అమెరికాకు నేరుగా విమానం రావడంతో ఈ ప్రాంతంలోని కార్పొరేట్ వర్గాలకు ఎంతగానో ఉపయోగపడ గలదని భావిస్తున్నారు. మరోవంక, రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన తెలుగువాళ్ల సంఖ్య అమెరికాలో  వేగంగా పెరుగుతోంది.
భారతదేశం నుండి చదువు కోసం విదేశాలకు వెళ్లే ప్రతి నలుగురు విద్యార్థులలో ఒకరు ఈ  రాష్ట్రాలకు చెందిన వారని తెలుస్తోంది. ప్రతి సంవత్సరం అమెరికాకు వచ్చే విదేశీ విద్యార్థుల సంఖ్యపరంగా భారతదేశం రెండోస్థానంలో ఉంది. అమెరికా-భారత్  విద్యార్థులలో, 50-65 శాతం మంది విద్యార్థులు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే.  అలాగే, హైదరాబాద్‌ కు  భారత ఫార్మా రాజధానిగా, టీకాల ఉత్పత్తి కేంద్రంగా కూడా పేరుంది. 
 
హైదరాబాద్-అమెరికా మార్కెట్ విభాగంలో ప్రస్తుతం ఎయిర్ కార్గో 22,000 మెట్రిక్ టన్నులు ఉంది. ఇది ఏటా 8 తం  పెరుగుతోంది. ఈ రెండు ప్రాంతాల మధ్య కోవిడ్ వ్యాక్సిన్‌ను రవాణా చేయడానికి లాజిస్టిక్ సహాయాన్ని అందించడంలో ఈ సర్వీసు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ బబుల్ ఒప్పందం  కింద, బ్రిటిష్ ఎయిర్‌వేస్ వంటి విమానయాన సంస్థలు హైదరాబాద్‌ నుంచి యూకే, ఇతర చోట్లకు తమ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాయి. 
 
కాగా ఎమిరేట్స్, ఎతిహాద్, ఫ్లై దుబాయ్ మరియు ఎయిర్ అరేబియా హైదరాబాద్‌ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని వివిధ గమ్యస్థానాలతో కలుపుతూ తమ సేవలను తిరిగి ప్రారంభించాయి. ఖతార్ ఎయిర్‌వేస్ తో హైదరాబాద్‌, ఖతార్ రాజధాని నగరమైన దోహాతో తిరిగి కనెక్ట్ అయింది. 

ఎసిఐ ఎయిర్ పోర్ట్ హెల్త్ అక్రెడిటెడ్ అయిన హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అన్ని అంతర్జాతీయ విమానాల ప్రయాణీకుల రాకపోకలను భద్రతా ప్రోటోకాల్ ప్రకారం పూర్తిగా పరిశుభ్రమైన వాతావరణంలో నిర్వహిస్తున్నారు. 
 అన్ని ప్యాసింజర్ ప్రాసెసింగ్ పాయింట్ల వద్ద ప్రత్యేక క్యూయింగ్ ఏర్పాట్ల ద్వారా సామాజిక దూరం అమలు చేయడంతో పాటు టెర్మినల్స్‌లో తప్పనిసరి స్క్రీనింగ్ మరియు భద్రతా చర్యలు చేపడుతున్నారు. 
 
అక్టోబర్ లో, హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం తాము సొంతంగా రూపొందించిన ఈ-బోర్డింగ్ సేవలను  అంతర్జాతీయ విమాన సర్వీసులకు విస్తరించి, భారతదేశంలో ఆ పని చేసిన మొట్టమొదటి విమానాశ్రయంగా నిలిచింది.