వైమానిక దళంకు నటుడు అనిల్ కపూర్ క్షమాపణ 

బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ ‘ఏకే వెర్సస్ ఏకే’ చిత్రం విషయంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్)కు క్షమాపణ చెప్పారు. సినిమాలో ఆయన ఐఏఎఫ్ యూనిఫాం వేసుకుని, అనుచితమైన సంభాషణలు చేశారంటూ ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్ అభ్యంతరం వ్యక్తం చేసింది. 

ఐఏఎఫ్‌లో ఉండే వారి ప్రవర్తన, పరిభాషకు తగ్గట్టుగా ఆయన సంభాషణలు లేవని చెబుతూ, ఆ సన్నివేశాలను తొలగించాలంటూ ట్వీట్ చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా ఇదే నెలలో విడుదల కావలసి ఉంది. ఇందుకు సంబంధించిన ఇటీవల విడుదలైన ట్రయిలర్‌‌‌ను చూసిన ఐఏఎఫ్ తాజా ట్వీట్‌ చేసింది. 

దీనిపై అనిల్‌ కపూర్ వెంటనే స్పందిస్తూ  ‘ఎవరి మనోభావాలను గాయపరచే ఉద్దేశం నాకు లేదు. కావాలని చేసింది కూడా కాదు.  జరిగిన దానికి మనస్ఫూర్తిగా క్షమాపణ చెబుతున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. తాను క్షమాపణ చెబుతున్న వీడియోను కూడా దీనికి జత చేశారు. ఒక నటుడిగానే తాను సినిమాలో యూనిఫాం వేసుకున్నానని, ఆర్మీ ఆఫీసర్ పాత్ర చేశానని ఆయన చెప్పారు. ఇందులో తన కుమార్తె కిడ్నాప్‌కు గురవుతుందని, ఆ కోపం, కూతురు కనబడటం లేదన్న ఆక్రోశం పాత్రలో, సంభాషణల్లో కనిపిస్తుందని తెలిపారు.

పాత్రపరంగా అలా నటించానే కానీ, తనకు కానీ, దర్శకుడికి కానీ ఐఏఎఫ్ పట్ల ఎలాంటి అగౌరవం లేదని స్పష్టం చేశారు. ఐఏఎఫ్ నిస్వార్థ సేవలను తాను ఎప్పుడూ గుర్తు చేసుకుంటానని వివరించారు. ఎవరి మనోభావాలను గాయపరచాలనే ఉద్దేశం తనకు లేదని వివరణ ఇచ్చారు. ఏకే వెర్సస్ ఏకే చిత్రానికి విక్రమాదిత్య మోత్వాని దర్శకత్వం వహించారు. ఫిల్మ్‌మేకర్ అనురాగర్ కశ్యప్ మరో కీలక పాత్ర పోషించారు.