కౌగిలింతలు వద్దని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక 

కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే కౌగిలింతలకు దూరంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది. కలిసి భోజనం చేయడం, ఇళ్లు, ఆఫీసులు, విద్యాసంస్థల్లో ఎక్కువ సేపు గడపడం వంటి ‘సన్నిహితం’గా ఉండే చర్యలతో వైరస్‌ విస్తరించే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. 
 
 ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌ కేసుల విస్తరణ, మృతుల సంఖ్య పెరగడం పట్ల డబ్ల్యూహెచ్‌వో అత్యవసర విభాగపు చీఫ్‌ డాక్టర్‌ మైకేల్‌ ర్యాన్‌ ఆందోళన వ్యక్తం చేశారు.  
 
మరోవంక, ప్రాణాంతక కరోనా మహమ్మారి నిర్మూలనకు తొలి అడుగు పడింది. ఫైజర్‌ సంస్థ అభివృద్ధి చేసిన టీకా పంపిణీ కార్యక్రమాన్ని బ్రిటన్‌ మంగళవారం ప్రారంభించింది. 90 ఏండ్ల బ్రిటన్‌ బామ్మ మార్గరెట్‌ ‘మ్యాగీ’ కీనన్‌.. కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ తీసుకున్న ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. 
 
సెంట్రల్‌ ఇంగ్లాండ్‌లోని ఓ దవాఖానలో మంగళవారం ఉదయం 6.31 గంటలకు మ్యాగీకి టీకాను ఇచ్చారు. వైద్య రంగంలో ఇదో మైలురాయి వంటి క్షణమని నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌ (ఎన్‌హెచ్‌ఎస్‌) అభివర్ణించింది. మంగళవారాన్ని ‘వ్యాక్సిన్‌ డే’గా పేర్కొంది.  
 
 ‘కరోనా కట్టడిలో నేడు గొప్ప ముందడుగు వేశాం. వైరస్‌ ప్రమాదం ఎక్కువగా ఉన్న వారికి తొలుత వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తాం. టీకాను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు, క్లినికల్‌ ట్రయల్స్‌లో పాల్గొన్న వలంటీర్లను చూస్తే గర్వంగా ఉన్నది’ అని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ పేర్కొన్నారు. శీతాకాలంలో వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉండనున్నదన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన హితవు చెప్పారు.