‘భారత్ బంద్’కు ప్రతిపక్షాల మద్దతు నయవంచన  

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు మంగళవారం నిర్వహిస్తున్న ‘భారత్ బంద్’కు కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు మద్దతివ్వడం నయవంచనకు పాల్పడటమేనని అంటూ కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రతిపక్షాల తీరును తీవ్రంగా ఎండగట్టారు. ఈ చట్టాల పట్ల రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. 

ఇవి తమకు అనుకూలమైనవేనని రైతులు తెలుసుకోవాలని కేంద్ర  సూచించారు. కాంగ్రెస్‌పై విరుచుకుపడుతూ, ఆ పార్టీ అధికారంలో ఉన్నపుడు కాంట్రాక్ట్ ఫార్మింగ్ చట్టాన్ని ఆమోదించిందని గుర్తు చేశారు. అటువంటి కాంగ్రెస్ నేడు రైతులకు మద్దతివ్వడం, నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేయడం నయవంచన అని దుయ్యబట్టారు.

ప్రస్తుత సమస్య పరిష్కారమవుతుందని తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని పేర్కొన్నారు. ఈ చట్టాలపట్ల రైతులకు అయోమయం ఉన్నట్లయితే, వారి సందేహాలను నివృత్తి చేయడం తమ కర్తవ్యమని చెప్పారు. రైతుల సమస్యలను తాము పరిష్కరిస్తామని తెలిపారు.

అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీపై మోడల్ యాక్ట్‌ను ప్రతిపక్ష పార్టీలు పరిపాలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆమోదించాయని జవదేకర్ గుర్తు చేశారు. దీనిని ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ ప్రతిపాదించారని పేర్కొన్నారు.  ఈ చట్టాలను ప్రవేశపెట్టనున్నట్లు కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో కూడా చెప్పిందని తెలిపారు.

రైతులు ప్రధానంగా రెండు డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టారని అంటూ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ (ఏపీఎంసీ)లు, కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) కొనసాగుతాయా? అని అడుగుతున్నారని తెలిపారు. ఇవి గతంలో మాదిరిగానే కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.

నూతన వ్యవసాయ చట్టాలు అమల్లో ఉన్నప్పటికీ, ఈ ఏడాది కూడా రైతుల నుంచి ప్రభుత్వం వ్యవసాయోత్పత్తులను సేకరించిందని, లక్షలాది మంది పంజాబ్ రైతులు తమ వ్యవసాయోత్పత్తులను ఏపీఎంసీలకు కనీస మద్దతు ధరపై ఈ ఏడాది కూడా అమ్మారని, ఏపీఎంసీలు, ఎంఎస్‌పీ కొనసాగుతాయని చెప్పడానికి ఇదే నిదర్శనమని తెలిపారు.

వ్యవసాయోత్పత్తులను నేరుగా అమ్మేందుకు అవకాశం కల్పిస్తూ ప్రైవేటు మార్కెట్లు, యార్డులు, డైరెక్ట్ పర్చేజ్ సెంటర్లు, వినియోగదారులు/రైతుల మార్కెట్లను ఏర్పాటు చేసేందుకు స్టేట్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ (డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్, 2003 అవకాశం కల్పిస్తోందని స్పష్టం చేశారు.