స్వచ్ఛమైన క్రీడలకే భారత్ మద్దతు ఇస్తుంది  

న్యాయబద్ధమైన, స్వచ్ఛమైన క్రీడలకే భారత్ మద్దతు ఇస్తుందని కేంద్ర  క్రీడాశాఖ మంత్రి కిరెణ్ రిజిజు స్పష్టం చేశారు. క్రీడలపై నమ్మకాన్ని పెంపొందించేందుకు అన్ని విధాలా జరిగే కృషికీ బాసటగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.   “ఉత్ప్రేరక మందుల కట్టడి (యాంటీ డోపింగ్), క్రీడా విజ్ఞానశాస్త్రం”పై వెబినార్ సదస్సును ప్రారంభిస్తూ క్రీడలపై నమ్మకాన్ని పెంపొందించేందుకు అన్ని విధాలా జరిగే కృషికీ బాసటగా నిలుస్తామని చెప్పారు. 

జాతీయ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా), జాతీయ క్రీడా విశ్వవిద్యాలయం (ఎన్.ఎస్.యు.), జాతీయ డోప్ టెస్టింగ్ లేబరేటరీ (ఎన్.డి.టి.ఎల్.) ఉమ్మడిగా  ఈ వెబినార్ సదస్సు నిర్వహించాయి. వర్చువల్ పద్ధతిలో ఆన్.లైన్ ద్వారా జరిగిన ఈ వెబినార్ కు ప్రపంచ యాంటీడోపింగ్ ఏజెన్సీ (వాడా-డబ్ల్యు.ఎ.డి.ఎ.) అధ్యక్షుడు విటోల్డ్ బాంకా కూడా పాల్గొన్నారు.

 వాడా సంస్థకు భారత్ అందించిన సేవలను ఉత్ప్రేరక మందుల కట్టడికి జరిగే పరిశోధనకు, దర్యాప్తు సామర్థ్యాల బలోపేతానికి  వినియోగించుకోవాలని సంకల్పించడం పట్ల ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిరెన్ రిజిజు సంతోషం వ్యక్తం చేశారు. క్రీడల్లో డోపింగ్ బెడదను పూర్తిగా నిర్మూలించేందుకు నాడా కట్టుబడి ఉందని, డోపింగ్ కట్టడికి వాడా నిర్దేశించిన నిబంధనలన్నింటినీ నాడా అమలు చేస్తోందని కేంద్రమంత్రి చెప్పారు.

 “డోపింగ్ ప్రమేయంలేని క్రీడల నిర్వహణకు భారత్ కట్టుబడి ఉందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. డోపింగ్ బెడదను నిర్మూలనా కృషిలో క్రీడా సమాజానికి భారత్ ఎప్పటిలాగే మద్దతు కొనసాగిస్తుంది” అని పేర్కొన్నారు. 

యాంటీ డోపింగ్ విధానాలను, నిబంధనలను భారత్ పాటిస్తూనే ఉందని చెప్పారు. ప్రపంచ యాంటీ డోపింగ్ నియమావళికి, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భారత్ వ్యవరిస్తోందని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. ఈ విషయంలో వాడా సూచనలకు అనుగుణంగా ఎన్.డి.టి.ఎల్. చర్యలు తీసుకుందని తెలిపారు. 

నాడా బ్రాండ్ అంబాసిడర్ ,ప్రముఖ సినీ నటుడు సునీల్ షెట్టి మాట్లాడుతూ యాంటీ డోపింగ్ అంశంపై క్రమంతప్పని వెబినార్ల నిర్వహణతో  క్రీడాకారుల నడవడిక మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు.