పోలీసులతో ఘర్షణలో బెంగాల్ లో బిజెపి కార్యకర్త మృతి

పశ్చిమ బెంగాల్‌లోని సిలిగూరీలో బీజేపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య సోమవారం తీవ్ర ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణల్లో బీజేపీ కార్యకర్త ఒకరు మృతి చెందారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా బీజేపీ, దాని అనుబంధ విభాగమైన బీజేవైఎం సిలిగూరీలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. 

టీఎంసీ ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా ‘ ఉత్తరకన్య అభిజన్‌’ పేరుతో బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో సోమవరం రెండు ర్యాలీలు చేపట్టారు. దీంతో అడ్డుకునేందుకు పోలీసులు పలు చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేశారు.   స్థానిక అధికారులు 144 సెక్షన్ విధించారు. 

అయినా సరే బీజేపీ కార్యకర్తలు తమ నిరసన ప్రదర్శనను నిర్వహించారు. దీంతో  నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జ్‌ చేయడంతోపాటు నీటి ఫిరంగులు, భాష్ఫయువు గోళాలు ప్రయోగించారు. ఈ నేపథ్యంలో తీవ్రంగాగాయపడిన  బీజేపీ కార్యకర్త ఉలెన్ రాయ్చికిత్స పొందుతూ మరణించాడు.   

పోలీసులు గట్టిగా కొట్టడంతోనే తమ కార్యకర్త ప్రాణాలు కోల్పోయారని బీజేపీ ఆరోపించింది. తమ కార్యకర్త మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీజేపీ నేతలు డిమాండ్‌ చేశారు.

ఈ ఘటనపై యువమోర్చ జాతీయ అధ్యక్షుడు, ఎంపీ తేజస్వీ సూర్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఇది హత్యే. అంతకు మించి ఏదీ కాదు. మేం చాలా కోపంగా ఉన్నాం. మమతా దీదీ… తమరిని ఎప్పటికీ మరిచిపోలేం” అని హెచ్చరించారు.  పోలీసులు విసిరిన బాంబుల వల్లే తమ  కార్యకర్త ఉలేన్ రాయ్ మరణించారని  స్థానిక కార్యకర్తలు తమకు సమాచారం అందించారని అంటూ తేజస్వీ సూర్య తీవ్రంగా మండిపడ్డారు. 

అయితే  బీజేపీ హింసనే నమ్ముతుందనడానికి ఇదే బహిరంగ నిదర్శనమని అధికార టిఎంసి  ఎంపీ సౌగత్ రాయ్ ఆరోపించారు. పోలీసులు కాల్పులు జరిపేలా బీజేపీ కార్యకర్తలే రెచ్చగొట్టారని, అయినా సరే పోలీసులు చక్కగా హ్యాండిల్ చేశారని ఆయన ప్రశంసించారు.

కాగా, కార్యకర్తలను చెదరగొట్టడానికి తాము టియర్ గ్యాస్, వాటర్ కెనన్లు మాత్రమే వాడామని పోలీసులు తెలిపారు. అయితే ఈ సమయంలోనే ఓ కార్యకర్త మృత్యువాత పడినట్లు తమకు సమాచారం అందిందని, శవపరీక్ష జరిగిన తర్వాతే అసలు విషయాలు బయటికి వస్తాయని పోలీసులు పేర్కొన్నారు.