టీఆర్ఎస్, ఎంఐఎం “పొత్తు”ను తిరస్కరించారు    

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో  టీఆర్ఎస్, ఎంఐఎం మధ్య లోపాయికారీ ఒప్పందాన్ని ప్రజలు తిరస్కరించారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు.  ఎంఐఎం కేవలం 51 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా పరోక్షంగా టీఆర్ఎస్ కు మద్దతు పలికిందని ఆరోపించారు.
 
99 స్థానాలలో ఎంఐఎం టీఆర్ఎస్ కు ప్రత్యక్షంగా మద్దతు పలికిందని చెబుతూ . టీఆర్ఎస్ గెలిచిన 56 స్థానాల్లో 55 బిజెపిపై అయితే, 1 మాత్రం కాంగ్రెస్ పైన గెలిచిందని, ఎంఐఎంపై ఒక్క చోటా గెలవలేదని గుర్తు చేశారు. పి.వి.నరసింహారావు, ఎన్టీఆర్ ను అవమానించే విధంగా ఎంఐఎం నేతలు మాట్లాడినా కేసీఆర్ మౌనం వహించి వారి వ్యాఖ్యలను వత్తాసు పల్కినదని సంజయ్ ఆరోపించారు.
 
రజాకార్ల హింసాకాండలో బాధితులైన అమరవీరులకు స్మారకస్థూపం నిర్మిస్తామన్న బిజెపి హామీకి ప్రజలు మద్దతు తెలిపారని చెప్పారు. వెనకబడిన వర్గాలకు ఉద్దేశించబడిన 50 స్థానాలలో 31 స్థానాలను ఎంఐఎం ఈరోజు గెలిచిందని తెలిపారు.  హిందువులలో వెనకబడిన తరగతులకు ఉద్దేశించబడిన ఈ 31 స్థానాలలో చట్టవిరుద్ధంగా ముస్లింలకు కట్టబెట్టి టీఆర్ఎస్-ఎంఐఎం బీసీవ్యతిరేక వైఖరిని మరోసారి బయటపెట్టుకుందని సంజయ్ విమర్శించారు.
ఎస్సీలకు కేటాయించబడిన 10 స్థానాల్లో బిజెపి 3 స్థానాలను (రాజేంద్రనగర్, జియాగూడ, కవాడిగూడ), ఎస్టీలకు కేటాయించబడిన 2 స్థానాల్లో 1 స్థానం (హస్తినాపూరం) బిజెపి దక్కించుకుంది. బిజెపి నుండి గెలిచినవారు మెజారిటీ సభ్యులు బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారు కావడం గమనార్హం అని వివరించారు.
ఎంఐఎం గెలిచిన 44 స్థానాల్లో హిందువుల ఓట్లు తగ్గాయని,  ముస్లింల ఓట్లు పెరిగాయని చెబుతూ ఈ విషయాన్ని నవంబర్ 18న బిజెపి ఎలక్షన్ కమిషన్, మీడియా దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని   సంజయ్ మండిపడ్డారు. మొత్తం 150 డివిజన్ లో 149 డివిజన్ లను ప్రకటించగా బిజెపి మొత్తం 48 స్థానాల్లో విజయం సాధించిందని, మరో 79 స్థానాల్లో రెండో స్థానంలో నిలిచామని చెప్పారు.
ఎంఐఎం, కాంగ్రెస్ గెలిచిన 23 స్థానాల్లో కూడా టీఆర్ఎస్ కన్నా బిజెపికే ఎక్కువ ఓట్లు వచ్చాయి. 100 కన్నా తక్కువ ఓట్లతో రెండు సీట్లు, 500 కన్నా తక్కువ ఓట్లతో 5 సీట్లు, 1000 కన్నా తక్కువ ఓట్లతో మరో 5 సీట్లు కోల్పోయామని సంజయ్ వివరించారు.
 
టీఆర్ఎస్ సర్కార్ ఎన్ని ప్రతిబంధకాలు సృష్టించినా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజల మద్దతుతో బిజెపి విజయం సాధించిందని సంజయ్ తెలిపారు. స్వతంత్య్రంగా పనిచేయాల్సిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ ముఖ్యమంత్రి ఆదేశాలతో పనిచేశారని ఆరోపించారు.
రాష్ట్ర పోలీస్ వ్యవస్థ కూడా రాజకీయ ఒత్తిడిలకు తలొగ్గి బిజెపి కార్యకర్తలపై అనేక దాడులు చేసినప్పటికీ ప్రజలు బిజెపికే మద్దతిచ్చారని చెప్పారు. అధికార యంత్రాంగం నిష్పక్షపాతంగా వ్యవహరించి ఉంటే బిజెపి మరో 25 సీట్లు గెలిచి ఉండేదని స్పష్టం చేశారు.
 
మాకు అభ్యర్థులను ఎంపిక చేసుకునే సమయం కూడా ఇవ్వకుండా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదరాబాదరాగా ఎన్నికలు నిర్వహించడం వల్ల ఆశించిన మేర గెలవలేకపోయామని తెలిపారు. కొంచెం సమయం ఇచ్చి ఉంటే జీహెచ్ఎంసీలో బిజెపి మేయర్ ఉండేవారని స్పష్టం చేశారు.
 
టీఆర్ఎస్ ప్రజల విశ్వాసం కోల్పోతుందనడానికి, బిజెపి పెంచుకుంటోందనడానికి ఈ జీహెచ్ఎంసీ ఎన్నికలు నిదర్శనమని సంజయ్ చెప్పారు. నగరంలో బిజెపి వోట్ షేర్ గణనీయంగా పెరిగినదని చెబుతూ టీఆర్ఎస్, ఎంఐఎం లోపాయికారీ ఒప్పందం ఉండి, కలసి పోటీ చేసినా రెండు పార్టీల ఓట్ల తేడా 0.2% మాత్రమే అని గుర్తు చేశారు.
 
కోవిడ్, శాంతిభద్రతల సమస్య అంటూ డీజీపీ స్థాయి వ్యక్తులు ప్రెస్ కాన్ఫరెన్సులతో భయభ్రాంతులకు గురి చేసినప్పటికీ ప్రజలు ఓటు వేసేందుకు వచ్చారని పేర్కొన్నారు. 2016లో పోలింగ్ శాతం 45.21 శాతం ఉంటే 2020లో 46.6 శాతంకు పెరిగిందని అన్నారు. ఇది టీఆర్ఎస్ పట్ల ప్రజా వ్యతిరేకతకు నిదర్శనమని స్పష్టం చేసారు.  ఒకవేళ టీఆర్ఎస్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయకుండా ఉంటే పోలింగ్ శాతం మరింత పెరిగే ఉండేదని సంజయ్ తెలిపారు.