కొత్త చట్టాలవల్ల కనీస మద్దతు ధర(ఎంఎస్‌పి) విధానం లేకుండా పోతుందని, హోల్‌సేల్ మార్కెట్ విధానం వల్ల ఎంఎస్‌పి విధానం నిర్వీర్యంగా మారిపోయిందని, ఫలితంగా వ్యవసాయ రంగంలోని వివిధ భాగస్థులు నష్టపోతారని ఆందోళన చేస్తున్న రైతులు వాదిస్తున్న విషయం తెలిసిందే. అందుకే కొత్త చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని, కనీస మద్దతు ధరకు గ్యారంటీ కల్పిస్తూ కొత్త చట్టాన్ని తీసుకు రావాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
అయితే కొన్ని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నట్లుగా కొత్త చట్టాలను రద్దుచేయడానికి బదులు వాటికి నాలుగు సవరణలు తీసుకు రావాలని తాము ప్రతిపాదిస్తున్నట్లు బికెఎస్ ప్రధాన కార్యదర్శి బద్రీ నారాయణ్ చౌదరి చెప్పారు. రైతుల భయాలను తొలగించడానికి ఈ నాలుగు సవరణలు చేస్తే సరిపోతుందని ఆయన చెప్పారు.
హోల్‌సేల్ మార్కెట్లలో కానీ, బైట కానీ కనీస మద్దతు ధరకన్నా తక్కువకు కొనకుండా చూడడం, వ్యాపారులందరూ ప్రభుత్వ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవడం, ఆ పోర్టల్ అందరికీ అందుబాటులో ఉంచడం, బ్యాంక్ గ్యారంటీ ద్వారా నిర్ణీత సమయంలో రైతులకు వారు అమ్మిన పంటకు సొమ్ము చెల్లించడం, రైతుల వివాదాలను పరిష్కరించడానికి వారి దగ్గరి పట్టణాల్లోనే వ్యవసాయ ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయడం అనేవి ఈ నాలుగు సవరణలను బికెఎస్ తెలిపింది.
కాగా కొత్త చట్టాలను బికెఎస్ స్వాగతిస్తూ, ఇది తాము చాలా కాలంగా చేస్తున్న డిమాండ్ అని పేర్కొంది. ‘ఒకే దేశం ఒకే మార్కెట్’ కోసం తమ సంఘం చాలా కాలంగా డిమాండ్ చేస్తోందని చౌదరి చెప్పారు.
రైతులు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని హోల్‌సేల్ మార్కెట్లను ప్రవేశపెట్టడం జరిగిందని, అయితే క్రమేణా అవి రైతులను దోచుకునే సాధనాలుగా మారిపోయాయని ఆయన విమర్శించారు. ఈ విధానాన్ని మార్చాలని చాలా రైతు సంఘాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయని కూడా ఆయన చెప్పారు.
More Stories
వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లను ప్రారంభించిన ప్రధాని మోదీ
లైంగిక వేధింపుల ఆరోపణలతో జానీ మాస్టర్ పై జనసేన వేటు
సామరస్యంతోఅస్పృస్యతను పూర్తిగా నిర్ములించాలి