బ్రహ్మపుత్ర నదిపై  భారీ జలవిద్యుత్ ప్రాజెక్ట్  

బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న ఆనకట్టల వల్ల కలిగే ప్రమాదాన్ని నివారించడానికి  అరుణాచల్‌ప్రదేశ్‌లో ఆ నదిపై 10 గిగావాట్ల జలవిద్యుత్‌ ప్రాజెక్టును నిర్మించే అంశాన్ని భారతదేశం పరిశీలిస్తోంది. కేంద్ర జల శక్తి శాఖకు చెందిన సీనియర్‌ అధికారి టీఎస్‌ మెహ్రా ఈ విషయాన్ని తెలిపారు.

 అరుణాచల్‌ ప్రదేశ్‌లోని సియాంగ్‌ నదిపై (టిబెట్‌ నుంచి భారత్‌లోకి ప్రవేశించినప్పుడు బ్రహ్మపుత్రను ఇలాగే పిలుస్తారు. అక్కడి నుంచి దిగువకు ప్రవహించే క్రమంలో దానికి అనేక ఉపనదులు కలుస్తాయి. వాటన్నింటినీ కలిపి బ్రహ్మపుత్ర నదిగా వ్యవహరిస్తారు) ప్రతిపాదిస్తున్న 9.2 శతకోటి ఘనపు మీటర్ల అప్పర్‌ సియాంగ్‌ ప్రాజెక్టు బ్రహ్మపుత్ర నదికి వరదలు వచ్చినప్పుడు అదనపు నీటిని తీసుకోగలుగుతుందని ఆయన వివరించారు. 

టిబెట్‌ నుంచి అరుణాచల్‌ ప్రదేశ్‌, అసోం మీదుగా బంగ్లాదేశ్‌లోకి ప్రవహించే బ్రహ్మపుత్ర నదిని చైనా ‘యార్లంగ్‌ సాంగ్‌బో’గా పిలుస్తుంది. ఆ నదిపై చైనా కడుతున్న భారీ ఆనకట్టల వల్ల అరుణాచల్‌ప్రదేశ్‌, అసోం రాష్ట్రాల్లో భారీ వరదలు వచ్చే ప్రమాదం, కొన్నిసార్లు నీటికి కటకట ఏర్పడే ముప్పు ఉన్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.

ఉదాహరణకు.. ఈ ఏడాది జూలైలో బ్రహ్మపుత్ర నదికి వరదలు రావడంతో అసోంలో 100 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ముప్పును నివారించడానికే అరుణాచల్‌ప్రదేశ్‌లో బ్రహ్మపుత్ర నదిపై భారీ డ్యామ్‌ నిర్మించాలన్న ప్రతిపాదన చేశామని,  ప్రభుత్వంలోని అత్యున్నతస్థాయి వర్గాలు దీన్ని పరిగణనలోకి తీసుకున్నాయని మెహ్రా వివరించారు.

‘‘బ్రహ్మపుత్రపై చైనా చేపట్టే ఏ ప్రాజెక్టు అయినా అది భారత్‌పై ప్రతికూల ప్రభావం చూపకూడదని మేం గతంలోనే సూచించాం. చైనా అందుకు హామీ ఇచ్చింది. కానీ, ఆ హామీని ఎంతమేరకు నిలబెట్టుకుంటుందో చూడాలి.’’ అని ఆయన పేర్కొన్నారు.