కరోనాతో బీజేపీ ఎంపీ మృతి

కరోనా బారినపడి బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు అభయ్ భరద్వాజ్ (66) మృతిచెందారు. ఆయన గుజరాత్ నుంచి రాజ్యసభ్యకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కరోనాకు చికిత్స పొందుతూ ఆయన మంగళవారం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో కన్నుమూశారు.

ఆయనకు కరోనా సోకిన తర్వాత న్యుమోనియా బారినపడ్డారు. ఆయన ఆరోగ్యం విషమించడంతో లైఫ్ సపోర్ట్ మీద ఆయనకు వైద్యం అందించారు. అయినా కూడా ఆయన ఊపిరితిత్తులు దెబ్బతినడంతో మంగళవారం సాయంత్రం 4:35 గంటలకు ఆయన చనిపోయారని ఎంజీఎం అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ అనురాధ బాస్కరన్ తెలిపారు.

అభయ్ భరద్వాజ్ రాజకోట లో సీనియర్ న్యాయవాది, సీనియర్ బిజెపి నేత. ఆయన ఈ ఏడాది జూన్ లో  రాజ్యసభకు ఎన్నికయ్యారు. పార్టీ సమావేశాలకు, రాజ్‌కోట్‌లో జరిగిన రోడ్‌షోకు హాజరైన తర్వాత ఆయనకు ఆగస్టు 31న కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. 

ఆ తర్వాత ఆయన మొత్తం కుటుంబానికి వైరస్ సోకింది. దాంతో అభయ్ భరద్వాజ్ రాజ్‌కోట్‌లోని సివిల్ ఆస్పత్రిలో చేరారు. అక్కడ ఆయన ఆరోగ్యం విషమంగా ఉండటంతో చెన్నైలోని ఎంజీఎంకు తరలించారు.

భరద్వాజ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంభ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.  ‘గుజరాత్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఎంపీ అభయ్ భరద్వాజ్ ఒక గొప్ప న్యాయవాది. ఆయన సమాజ సేవలో ముందంజలో ఉన్నారు. ఆయనకు జాతీయాభివృద్ధి పట్ల మక్కువ ఎక్కువ. ఆయన కుటుంబానికి మరియు స్నేహితులకు నా సంతాపం. ఓం శాంతి’ అని ఆయన ట్వీట్ చేశారు.

గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మాట్లాడుతూ బీజేపీ ఒక సమర్థుడైన నాయకుడిని కోల్పోయిందని పేర్కొన్నారు. ‘అభయ్ భరద్వాజ్ ఒక జాతీయవాది. ఆయన చట్టబద్దమైన, నిబద్ధత కలిగిన ప్రజా సేవకుడు. అలాంటి గొప్ప స్నేహితుడిని కోల్పోయినందుకు నేను చింతిస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతి’ అని రూపానీ ట్వీట్ చేశారు.

ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ అహ్మద్ పటేల్ కరోనాతో నవంబర్ 26న మరణించిన విషయం తెలిసిందే. దీంతో ఒక వారంలోనే ఇద్దరు రాజ్యసభ ఎంపీలను గుజరాత్‌ కోల్పోయిన్నట్లయింది.