రైతులతో మరోమారు 3న కేంద్రం చర్చలు

దేశ రాజధాని హస్తినలో ఆందోళనకు దిగిన రైతులతో కేంద్రం జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతు సంఘాల నేతలు కేంద్రానికి తేల్చి చెప్పారు. అయితే ఆ చట్టాలలో తమకు అభ్యంతరకరమైన అంశాలను నిర్దుష్టంగా బుధవారం నాటికి తెలిపితే, వాటిపై గురువారం మరోసారి చర్చింపవచ్చని ప్రభుత్వం సూచించింది. 
 
వ్యవసాయ నిపుణులైన అధికారులతో కమిటీ వేసేందుకు కేంద్రం ప్రతిపాదన చేసింది. ఈ కమిటీలో కేంద్ర ప్రభుత్వ అధికారులు, వ్యవసాయరంగ నిపుణులు ఉంటారని, రైతు సంఘాల నుంచి ఎవరు ప్రతినిధులుగా ఉంటారో పేర్లు ఇవ్వాలని కేంద్ర వ్యవసాయశాఖా మంత్రి తోమర్‌ కోరగా రైతు సంఘాల నేతలు తిరస్కరించారు.    
 
పంజాబ్‌, ఉత్తరఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్ర మంత్రులు తోమర్‌, పియూష్‌ గోయల్‌, సోమ్‌ ప్రకాశ్‌ చర్చలు జరిపారు.  నవంబర్ 3న రైతు సంఘాలతో మరోసారి చర్చించాలని కేంద్రం నిర్ణయించింది. చర్చల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఆందోళన కొనసాగిస్తామని రైతు సంఘలు స్పష్టం చేశాయి. 
 
రైతు సంఘాలతో చర్చల గురించి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్ మాట్లాడుతూ  నవంబర్ 3న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించామని, సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటును ప్రతిపాదించామని తెలిపారు. ఇతర రైతులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని నరేంద్రసింగ్‌ తోమర్ వెల్లడించారు.  
 
అంతకముందు చర్చలకు ఎటువంటి షరతులు లేకుండా కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించడంతో చర్చలకు వెళ్లాలని రైతు సంఘాల నాయకులు నిర్ణయించుకున్నారు. ఈ చర్చలలో పంజాబ్ కు చెందిన 32 రైతు సంఘాలు, హర్యానాకు చెందిన ఇద్దరు రైతు నాయకులు, యోగేంద్ర యాదవ్, యూపీకి చెందిన మరో నేత పాల్గొన్నారు.  
 
తమ డిమాండ్లు తీరే వరకు వెనక్కి తగ్గేది లేదని, పంజాబ్‌, హర్యానా నుంచి రైతులు ఇంకా వస్తున్నారని, ఏడాది పాటైనా బైఠాయించేందుకు సిద్దపడి వచ్చామని రైతు సంఘాల నేతలు చెప్పారు.